రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి నిధులు విడుదల చేసింది. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు లక్ష వరకూ రుణాలపై పూర్తిగా వడ్డీ మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినాక తొలిసారి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి రూ.510 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 14.58 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని ఏపీ సీఎం ప్రకటించారు. పథకం గొప్పదే అయితే, రుణాలు తీసుకున్న మొత్తం రైతుల్లో కేవలం 20 శాతం మందికే ఈ ప్రయోజనం దక్కింది. మ్యానిఫెస్టోలో లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ సున్నా వడ్డీ వర్తిస్తుందని చెప్పిన వైసీపీ అధినేత, తాజాగా సంవత్సరంలోపుగా రుణం చెల్లించిన రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పథకం అంటూ, పథకంలో 80 శాతం ఖర్చుకు కోత వేశారు. అంటే పథకం అమలు చేయాలి. కానీ ఖర్చు మాత్రం తగ్గాలి అనే విధంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం తయారైందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రుణాలు తీసుకున్న రైతులు 14.58 లక్షలేనా
ఏపీలో మొత్తం 80 లక్షల మంది రైతులు పలు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందుతున్నారు. వీరంతా రూ.30 వేల నుంచి గరిష్ఠంగా రూ.3 లక్షల దాకా పంట రుణాలు తీసుకుంటున్నారు. లక్ష వరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తే 80 లక్షల మంది రైతులకు లక్ష రుణం వరకూ వడ్డీ ప్రయోజనం పొందాలి. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం కేవలం 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్లు అది కూడా 2019 ఖరీఫ్ రుణాలకు వడ్డీకి జమ చేస్తున్నామని చెపుతోంది. అంటే లక్షపైన రుణం తీసుకున్న రైతులకు మొండి చేయి చూపారు. రెండెకరాల భూమి ఉన్న రైతుకు కూడా బ్యాంకులు రూ.2 లక్షల దాకా రుణాలు ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం లక్షలోపు రుణం తీసుకున్న వారిని, అది కూడా సంవత్సరంలోపు రుణం చెల్లించి ఉండాలనే నిబంధనలతో 80 శాతం మంది రైతులకు సున్నా వడ్డీ ప్రయోజనం దక్కకుండా చేసింది.
ఒక్కో రైతుకు దక్కేది రూ.3,500 మాత్రమే
ఏపీ ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా చెప్పుకుంటోన్న వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 14.58 లక్షల మందికి రూ.510 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పుకుంటోంది. అయితే ఒక్కో రైతుకు దక్కేది సగటున రూ.3,500 మాత్రమే. అదికూడా రుణాలు తీసుకున్న రైతులందరికీ దక్కదు. అప్పులు తీర్చలేక, నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరదు. ఎందుకంటే లక్షలోపు రుణం తీసుకుని సంవత్సరంలో చెల్లించి ఉండాలనే నిబంధన అలాంటిది మరి. సున్నా వడ్డీ ప్రయోజనాలు రైతులందరికీ ఇవ్వాలనే ఆలోచన ఉంటే రూ.3 లక్షల రుణం తీసుకున్న రైతులకు, సకాలంలో బకాయిలు చెల్లించలేకపోయిన సన్న,చిన్నకారు రైతులందరికీ సున్నా వడ్డీ పథకం వర్తించేలా చేయాలి. అంతేకాని మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రచారం జాస్తి, ప్రయోజనం నాస్తి
వైఎస్సార్ సున్నా వడ్డీకి మేం రూ.510 కోట్లు విడుదల చేశాం. చంద్రబాబునాయుడు మూడు సంవత్సరాలు ఇవ్వకుండా ఆపినవి కూడా మే ఇస్తూ వస్తున్నాం అని అర్భాటంగా ప్రకటనలు ఇచ్చిన పెద్దలు, చంద్రబాబు ఆపిన మొత్తంలో వీరు ఎంత విడుదల చేశారో మాత్రం చెప్పరు. రుణం తీసుకున్న ప్రతిరైతుకు దక్కాల్సిన సున్నా వడ్డీని, కేవలం 20 శాతం రైతులకు దక్కేలా చేయడం ద్వారా 80 శాతం మందిని అన్యాయం చేసినట్టు కాదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం మేం చేశాం. మాట ఇస్తే తప్పం. అని చెప్పుకోవడానికే తప్ప రైతు క్షేమం ఈ పథకంలో కనిపించడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.