జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యుల్ వచ్చేసింది. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల పోరుపై దృష్టి సారించాయి. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన, ప్రచార కమిటీలపై ఫోకస్ పెట్టాయి. దుబ్బాక ఎన్నిక విజయంతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని భారీ స్కెచ్ వేస్తోంది. దీనికోసం జాతీయ స్థాయి నేతలు రంగంలోకి ఇప్పటికే దిగారు. బీహార్, గుజరాత్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ ఇతర రాష్ట్రాల నేతలతో కూడిన జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీని ఇప్పటికే జాతీయ నాయకత్వం నియమించింది.
అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 నియోజకవర్గాల వారిగా ఇంఛార్జీలను కూడా నియమించే పనిలో ఉంది. శేరిలింగంపల్లికి ఎంపీ అరవింద్, మల్కాజ్‌గిరికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అంబర్‌పేటకు రేవూరి ప్రకాష్‌రెడ్డి, ఎల్.బి.నగర్‌కు సంకినేని వెంకటేశ్వర్‌రావు, నాంపల్లికి ఎంపీ సోయం బాబురావు, మహేశ్వరానికి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కూకట్‌పల్లికి పెద్దిరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుని రాజేంద్ర నగర్‌కు ఇంఛార్జీలుగా నియమించింది. ఇతర నియోజకవర్గాలకు కూడా మరికొంత మంది నేతలను ఇంఛార్జీలుగా బీజేపీ నియమించింది.
Also Read ;- దుబ్బాక దెబ్బతో పన్నులో రాయితీ.. మరీ జీహెచ్ఎంసీలో దెబ్బకొడితే?
మూడు పార్టీల పొత్తు?..
గ్రేటర్ ఎన్నికలకు నగరా మోగడంతో రాజీకీయ పార్టీలు ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నాయి.
లెక్కలు, అంచనాలను బేరీజు వేసుకుంటూ మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోవాలా వద్దా? అనే సమాలోచనలను జరుపుతున్నాయి. బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో సుమారు 20 నుంచి 50 డివిజన్లపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టనట్లు తెలుస్తోంది. గ్రేటర్‌లో జనసేనాకు సభ్యత్వంతో పాటు అభిమానులు కూడా ఉన్నారు. కాస్త కష్టపడితే వాటిని ఓట్లుగా మలుచుకుని సీట్లుగా మార్చుకోవచ్చనే ఆలోచనలో జనసేనాని పవన్‌కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించింది. అయితే తమతో కలిసి వచ్చే లౌకిక పార్టీలతో ముందుకు వెళ్లేందుకు ఆ పార్టీ నాయకత్వం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో జనసేనా పొత్తు విషయంలో తుది నిర్ణయం తమ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌దే అని తెలంగాణ జనసేన నేతలు పేర్కొంటున్నారు. మేయర్ పీఠంను టార్గెట్ గా బీజేపీ పెట్టుకుంది. దీంతో బీజేపీ-జనసేన పార్టీలు మాత్రం ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కమిటీలను నియమించింది. ఒక కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. షబ్బీర్ అలీ, భట్టివిక్రమార్కతో పాటు ఇంకా కొంత మంది నేతలు ఈ కమిటీలో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో ఆయా పార్టీలు బిజీగా ఉన్నాయి.
Also Read ;- గ్రేటర్‌లో పరీక్షించు కుందాం.. రంగంలోకి మంత్రి సబిత వారసుడు