దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆపేసిన చిత్ర బృందం .. అతి త్వరలోనే చిత్రీకరణ పునఃప్రారంభించబోతోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాలో కథానాయికలుగా ఆలియా భట్, విదేశీ వనిత ఓలీవియా మోరిస్ నటిస్తుండగా.. ఇంకా సముద్రఖని, అజయ్ దేవ్ గన్, రే స్టీవెన్ సన్, ఆలిసన్ డూడీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి విదేశీ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపాడు రాజమౌళి. ఇక ఆయన సినిమాకి హైలైట్స్ గా నిలిచిపోయే గ్రాఫిక్స్ .. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి.. చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయట. అలాంటి ఈ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ సీన్ వేరే లెవెల్లో ఉంటుందని టాక్స్ వినిపిస్తున్నాయి.
కొమరం భీమ్ గా యన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీలో హీరోల ఇంట్రడక్షన్ సీన్ .. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని సినిమాకి మేజర్ హైలైట్ అదేనని సమాచారం. పోలీస్ ఆఫీసర్ అయిన రామ్ చరణ్ తన బృందంతో .. యన్టీఆర్ ను అరెస్ట్ చేయడానికి వస్తాడట. అప్పుడు యన్టీఆర్ కి గిరిజనులు అండగా నిలబడతారట. ఇక్కడ జరిగే ఫైట్ ను అద్భుతమైన రీతిలో కంపోజ్ చేశారట విదేశీ సాంకేతిక నిపుణులు. అలాగే.. ఈ ఫైట్ లో గ్రాఫిక్స్ కళ్ళు చెదిరే రీతిలో ఉంటాయని వినికిడి. మరి ఆర్.ఆర్.ఆర్ లో ఈ ఫైట్ ను చూడాలంటే.. మరికొద్ది నెలలు ఆగాల్సిందే.