తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి అనుచరులుగా ముద్ర ఉన్న వ్యక్తులు ఆ ప్రాంతంలో చెలరేగి వ్యవహారాలు నడిపిస్తూన్నట్లుగా పేరు పడ్డారు. ఇప్పుడు ఏమైందో తెలియదు. రకరకాల నేరారోపణల మీద.. ఆ ఇద్దరిని వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈలోగా మరో ట్విస్టు ఏంటంటే.. ఆ ఇద్దరినుంచి తనకు ప్రాణాపాయం ఉన్నదని ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే నుంచి తమకు ప్రాణహాని ఉన్నదంటూ ఆ ఇద్దరూ కూడా అంటున్నారు. వారిలో ఒకరు సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఆ ఇద్దరి పేర్లు శృంగారపాటి సందీప్, సలివేంద్ర సురేష్.
సలివేంద్ర సురేష్ అనే ఉండవిల్లి శ్రీదేవి అనుచరుడు, వైసీపీ కార్యకర్త.. కిలారు రాజేష్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిపై అమరావతి రాజధాని వెలుపలి ప్రాంతంలో భూములు కొన్నట్లుగా సీఐడీ వద్ద కేసు పెట్టి ఇటీవల వార్తల్లోకి వచ్చారు. అయితే అదివరలోనూ శ్రీదేవి ఆశీస్సులతో పేకాట దందాలు నిర్వహిస్తూ పోలీసులు అరెస్టు చేసిన చరిత్ర అతనికి ఉంది. ఈ విషయాలపై లియోన్యూస్ గతంలో ‘పేకాట రాయుడి భుజాలపై వైసీపీ దళాల తుపాకీ’ అనే శీర్షికతో సవివరమైన కథనం అందించింది. ఎమ్మెల్యే శ్రీదేవితో సదరు సలివేంద్ర సురేష్ కు ఉన్న అనుచర అనుబంధాన్ని కూడా అందులో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అతని ఫేస్ బుక్ వాల్ మీద కూడా ప్రొఫైల్ పిక్ గా శ్రీదేవితో కలిసి దిగిన ఫోటోనే ఉండే సంగతినికూడా ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కరు గల కారుతో తిరుగుతున్న వైనం కూడా ప్రస్తావించడం జరిగింది.

తర్వాత ఏం విభేదాలు వచ్చాయో గానీ.. వారిద్దరినీ పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ఉండవిల్లి శ్రీదేవి ఆ ఇద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీదేవి స్వయంగా తనకు ఫోన్ చేసి.. పేకాట క్లబ్ లు నిర్వహిస్తే కమిషన్లు దండిగా వస్తాయని చెప్పిన ఆడియోను, సందీప్ మీడియాకు విడుదల చేశారు. ఆ ఫోన్ కాల్ సంభాషణ తనగొంతును మార్ఫింగ్ చేశారని అది తన ఫోన్ కాల్ కాదని.. అదే నిజమైతే పోలీసులకు ఇచ్చి ఉండాల్సిందని శ్రీదేవి దానికి కౌంటర్ ఇచ్చారు. శ్రీదేవి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదంటూ.. ప్రెస్ మీట్ తర్వాత అదృశ్యమై ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న శృంగారపాటి సందీప్ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో భోరు భోరున విలపించాడు. తన ప్రాణహాని గురించి ప్రస్తావించాడు. అయితే చాలా కట్‌లతో జాగ్రత్తగా ఎడిటింగ్ చేసిన వీడియో అది. సహజంగా సెల్ఫీ వీడియో అన్ని ఎడిటింగ్ లతో ఉండడం అరుదు. ఆ నేపథ్యంలో అసలు శ్రీదేవి ఫోను సంభాషణ నిజమేనా.. ఆ వీడియో సరైన ఆవేదనేనా అనే అనుమానాలూ వస్తున్నాయి.
దందాల రూపంలో శ్రీదేవి మహా పాపులర్
గతంలో పేకాట దందాలు నిర్వహిస్తున్నట్లుగా శ్రీదేవి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనూ ఆమె దానికి కౌంటర్ గా వీడియో విడుదల చేశారు. నాకు డబ్బుల్లేవా.. పేకాట క్లబ్ లుపెట్టి డబ్బు సంపాదించాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత.. పోలీసు ఎస్ఐను ఇసుక ట్రాక్టర్లు తాను చెప్పినా విడిచిపెట్టలేదనే కోపంతో అడ్డగోలుగా తిడుతూ మళ్లీ ఆడియో రికార్డింగ్ కు దొరికిపోయారు. ఇప్పుడు పేకాట క్లబ్ లను ఇష్టపూర్వకంగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు మరో ఆడియో దొరికింది.

సలివేంద్ర సురేష్ కామెడీ!
సలివేంద్ర సురేష్ విషయానికి వస్తే.. ఆయన కూడా శ్రీదేవి అనుచరుడు. తాను పేకాట దందాల కేసుల్లో ఉంటూనే రాజధాని వెలుపల భూముల కొనుగోలుపై కూడా సీఐడీ కేసులు పెట్టారు. ఈవిషయాన్ని దేవినేని ఉమా ప్రశ్నించారు కూడా. ఉండవల్లి శ్రీదేవి అనుచరుడే ఈ సురేష్ అని ఉమా అన్నారు. ఆలోగా శ్రీదేవితో వ్యవహారం చెడింది. తన ఫేస్ బుక్ పేజీలో ఆమెతో దిగిన ఫోటోను ప్రొఫైల్ గా తీసేశారు. తన మిత్రుడు శృంగారపాటి సందీప్ తో దిగిన ఫోటోను పెట్టారు.
ఈలోగా దేవినేని ఉమాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నాకు అసలు ఆ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎవరో కూడా నాకు తెలీదు… ఆమె ఎలా వుంటదో కూడా నాకు తెలీదు.. నేను ఏ లవంగాల కి అనుచరుడిని కాదుబే… మమ్మల్ని పాములతో పోల్చకండి… మేము జగనన్న సైనికులం జై జగనన్న జై జై జగనన్న’’ అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
కానీ తమాషా ఏంటంటే.. సదరు సలివేంద్ర సురేష్.. ఫేస్ బుక్ ప్రొఫైల్ లో శ్రీదేవితో ఉన్న ఫోటో తీసేశారే గానీ.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు చాలా ఆ ఫేస్ బుక్ అకౌంట్ లోనే ఉన్నాయి.

ఇదంతా గమనిస్తోంటే.. సురేష్, సందీప్ ల మీద ఉన్న దందాల ఆరోపణల మురికి ఎమ్మెల్యే శ్రీదేవికి అంటుకోకుండా హైడ్రామా నడిపిస్తున్నారా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.