టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కి 100 కోట్ల జరిమానా విధిస్తూ ఏపీ మైనింగ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ అక్రమాలు చేశారని వారు తేల్చారు. ఈ ఫ్యాక్టరీ పరుతో యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపారని, 14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ గనుల దోపిడీ జరిగిందని గుర్తించినట్లు తేల్చారు.
ఎంతో విలువైన గనులను అక్రమంగా తవ్వుకుని విక్రయించినందుకు జేసీ దివాకర్ రెడ్డికి ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో జేసీ దివాకర్ రెడ్డి త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందినట్లుగా గుర్తించారు. ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చిన తర్వాత.. పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యుల పేరిట ఫ్యాక్టరీలో వాటాలు బదలాయింపు జరిగినట్లుగా తేల్చారు.
100 కోట్ల జరిమానా కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద జేసీ దివాకర్ రెడ్డి ఆస్తుల జప్తు చేస్తారని తెలస్తోంది.
ఈసారి పెద్ద జేసీ మీదనే కన్ను
జేసీ బ్రదర్స్ మీద ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం వరుసగా జరుగుతూనే ఉంది. అన్న అయిన జేసీ దివాకర్ రెడ్డి జోలికి ఇప్పటిదాకా రాలేదు. జేసీ ట్రావెల్స్ విషయంలో బస్సల్లో అక్రమాలకు పాల్పడనందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. కడప జైల్లో ఉంచారు. అప్పట్లోనే జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నా మీద కూడా కేసులు పెట్టొచ్చు.. అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత జేసీ కుటుంబంలోని పవన్ రెడ్డి తదితరులపై కూడా వేర్వేరు సందర్భాల్లో పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడు పెద్ద జేసీ వంతు వచ్చింది. జేసీ దివాకర్ రెడ్డికి ఏకంగా వంద కోట్ల రూపాయల జరిమానాలు విధించారు. అవి చెల్లించకపోతే ఆస్తులు కూడా జప్తు అంటున్నారు. ఈ పరిణామాలు ఎటు మలుపులు తిరుగుతాయో వేచిచూడాలి.
Also Read: టోల్ రాజా టోల్ : నడిరోడ్డు మీద నడ్డి విరవనున్న సర్కార్!