పాదయాత్రలు చేసినవాళ్లపై ఇంత నిర్బంధం మున్నెన్నడైనా ఉందా..?
రాజ్యాంగం చేత పట్టుకుని నడిచే పరిస్థితి ఉందా..?
స్టూలెక్కి మాట్లాడే దుస్థితి ఏ నాయకుడికైనా ఎదురైందా..?
లోకేశ్ అడుగేస్తే జగన్ కు ఎందుకంత భయం..? సీఎం కుర్చీ కదిలిపోతుందనే భయమా..?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘‘యువగళం’’ పాదయాత్ర 77రోజులుగా 27నియోజకవర్గాల్లో అప్రతిహతంగా సాగుతోంది, 1000కిమీ ల్యాండ్ మార్క్ ను అధిగమించింది…‘‘ఇంతై ఇంతింతై వటుడింతై’’ అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఊపేస్తోందీ యాత్ర, యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది..
అడ్డంకులెదురైన ప్రతిసారీ ఉత్తుంగ శిఖరమయ్యాడు..రెట్టింపు శక్తివంతుడయ్యాడు.. అన్నివర్గాల ప్రజల్లో హీరో వర్షిప్ పొందాడు..ప్రచార రథం లాక్కున్నారు, మైక్ సిస్టమ్ స్వాధీనం చేసుకున్నారు, సౌండ్ వెహికల్ స్టేషన్ లో పెట్టారు, చివరికి స్టూల్ పైనుంచి కూడా మాట్లాడనీకుండా స్టూల్ కూడా లాక్కున్నారు.
చెక్కుచెదరని ధైర్యంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తున్న తెలుగుదేశం పోరాటయోధుడుగా అటు పార్టీ కేడర్ లోనే కాదు, ఇటు ప్రజల గుండెల్లోనూ చెరగని ముద్ర వేస్తున్నాడు..అన్నివర్గాల ప్రజలందరి ఆశీస్సులే రక్షగా ముందుకు సాగిపోతున్నాడు..
దేశంలో ఎంతోమంది పాదయాత్రలు చూశాం..వాళ్లెవరికైనా ఇన్ని అడ్డంకులు ఎదురయ్యాయా..? ఇంత నిర్భంధం చేశారా..? వేదికెక్కనీకుండా వాళ్లని అడ్డుకున్నారా..? అడుగేయనీకుండా వాళ్లనాపారా..? నోరు తెరవనీకుండా వాళ్ల చేతిలో మైకు లాక్కున్నారా..? స్టూలెక్కి మాట్లాడే దుస్థితి కల్పించారా..? అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకుని నడవాల్సిన అగత్యం ఏర్పడిందా..? వేదిక పక్కనే బిల్డింగెక్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురైందా..? వాళ్లెవరికీ లేని నిర్బంధం లోకేశ్ పాదయాత్రకే ఎందుకు..?
లోకేశ్ పాదయాత్రలో ఇప్పటిదాకా 25కేసులు పెట్టారు..ప్రతి 20కిమీకు ఒక కేసు పెట్టారంటే ఏ స్థాయిలో నిర్బంధకాండ సాగుతోందో అద్దం పడుతోంది.. అడుగడుగునా నిర్బంధకాండ మధ్య లోకేశ్ కు ప్రజలే రక్షకులయ్యారు, కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
కాళ్లకు బొబ్బలెక్కినా చెరగని చిరునవ్వు..అమ్మకు, కొడుక్కి, భార్యకు దూరమైనా చెదరని నిబ్బరం..నిరంతరం జనంతోనే మమేకం..గడ్డం పెరిగింది, జుట్టు మాసింది, రంగు తగ్గాడు, బరువు తగ్గాడు..శారీరక కష్టాలెదురైనా వెనక్కి తగ్గలేదు, అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాలే అండగా అడుగు ముందుకే..ప్రజల సమస్యలను వింటూ, వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ, మేనిఫెస్టోలో ఆయా అంశాలను చేరుస్తూ టిడిపి అధికారంలోకి రాగానే ఆయా సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా ఇస్తూ ముందడుగేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలపై ఇప్పటిదాకా దాదాపు 1300వినతి పత్రాలు అందజేశారు.
ఈ 1000కిమీ పాదయాత్రలో తనకు, జనానికి మధ్య జగన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు..అడ్డంకులెన్ని పెట్టినా అధైర్యపడలే..మొక్కవోని ధైర్యంతో అధిగమిస్తున్నాడు. విమర్శలన్నీ తిప్పికొడ్తున్నాడు, అడుగడుగుకూ రాటుదేలాడు, సానపట్టిన వజ్రంగా మారాడు. ఎన్టీఆర్ ఆవేశం, చంద్రబాబు ఆలోచన, బాలయ్య ప్రభంజనమై తనదనే ప్రత్యేకతతో సాగుతున్నాడు. పేదల సమస్యలపై ప్రశ్నిస్తున్నాడు, వైసిపి అవినీతి కుంభకోణాలపై తిరగబడ్డాడు, ప్రత్యర్ధుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు, బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచాడు.
యువగళం పాదయాత్రలో అడుగడుగునా జన ప్రభంజనం, అన్నివర్గాల ప్రజలు బ్రహ్మరథం పడ్తున్నారు. అందరిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది, నవతరాన్ని తట్టి లేపుతోంది, అణచివేతపై తిరగబడ్తోంది, బాధితులకు అండగా నిలబడ్తోంది, బాధితులకు అండగా నిలబడ్తోంది, తప్పుచేస్తే నిలదీస్తోంది, ప్రభంజనమై సాగుతోంది.
ప్రత్యర్ధినెప్పుడూ అండర్ ఎస్టిమేట్ వేయరాదు..లోకేష్ ని పప్పని తప్పు చేశారు, నిప్పై కాల్చేస్తున్నాడు, మంట పుట్టిస్తున్నాడు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఎంత మంట పుట్టించాడో చూశాం..మంట తట్టుకోలేకే ఉండవల్లి కరకట్ట దాకా పరుగెత్తాడు. కరకట్ట కృష్ణా నీళ్లలో మునిగితేగాని ఆ మంట చల్లారల..అలాగే పెద్దిరెడ్డికి పుట్టించిన మంట అది మామూలు మంటకాదు..పిఎల్ ఆర్ మైన్స్ తాట తీశాడు, వాళ్ల క్వారీలు ఎక్స్ పోజ్ చేశాడు. వాళ్ల ట్రావెల్స్ కు మంట పుట్టించాడు. మంత్రి జయరాం వందల ఎకరాల భూకబ్జాలు, తాడిపర్తి పెద్దారెడ్డి స్కామ్ లు, పత్తికొండ శ్రీదేవి గ్యాంగ్ భూకబ్జాలన్నీ బైటపెట్టాడు..ఇలా సెల్పీ ఛాలెంజ్ లతో స్కామ్ లను బట్టబయలు చేయడం కొత్త ట్రెండ్, లోకేశ్ ట్రెండ్..
అలాగే టిడిపి చేసిన అభివృద్ధిని చూపి సెల్ఫీ సవాళ్లు విసరడం మరో ఎత్తు..చంద్రబాబు హయంలో తెచ్చిన కియా కార్ల పరిశ్రమను చూపించి సెల్ఫీ సవాల్..ఫాక్స్ కాన్ బస్సుల్లో మహిళా ఉద్యోగులను చూపి సెల్ఫీ సవాల్..టిడిపి హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను, వేసిన రోడ్లను చూపి ఇంకో సెల్ఫీ సవాళ్లు చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది..దీన్ని మేం తెచ్చాం, ఇది మేం చేశాం. ఈ 4ఏళ్లలో మీరేమైనా కంపెనీలు తెస్తే, అభివృద్ధి చేస్తే కమాన్ సెల్ఫీ చాలెంజ్ అంటూ లోకేశ్ చేస్తున్న సవాళ్లతో సిఎం జగన్ సహా మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టిడిపి చేసిన అభివృద్ధిని చూపించి, వైసిపి చేసిన అవినీతి కుంభకోణాలపై లోకేశ్ చేస్తున్న సవాళ్లతో వైసిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడ్తున్నాయి, గంగవెర్రులెత్తుతున్నారు. ఈ సెల్ఫీ చాలెంజ్ లే రామబాణాలుగా మారాయి. ఈ బాణాల దెబ్బకైన గాయాలకు ఆయింట్ మెంట్లు దొరక్క అల్లాడుతున్నారు వైసిపి నాయకగణ్యం..ఈ సెల్ఫీ ఛాలెంజ్ లు, సెల్ఫీ సవాళ్లతో వైసిపి అట్టుడికిపోతోంది. అటు వడదెబ్బ, ఇటు లోకేశ్ దెబ్బలతో అల్లాడుతున్నారు. అటు సూర్యుడు, ఇటు లోకేశ్ భగభగలే..
దేశంలో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన నాయకుల పాదయాత్రల్లో లేనంత నిర్బంధ కాండ నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఎదుర్కొన్నారు..జాతిపిత మహాత్మాగాంధీ పాదయాత్రలో, దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా అప్పటి తెల్లదొరలింతగా నిర్బంధకాండ లేదు.. ఆ తర్వాత ఆచార్య వినోబా బావే చేపట్టిన భూదానోద్యమం శాంతియుతంగానే సాగాయి..కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సాగిన మాజీ ప్రధాని చంద్రశేఖర్ 6నెలలపాటు జరిపిన 4260కిమీ పాదయాత్రలో ఇటువంటి ఆటంకాల్లేవు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 60రోజులపాటు చేసిన 1500కిమీ ‘‘మహా ప్రస్థానం’’ పాదయాత్రలోగాని, ఆ తర్వాత 2012 అక్టోబర్ లో చంద్రబాబు నాయుడు చేసిన వస్తున్నా మీకోసం 2817కిమీ పాదయాత్రలో, జగన్మోహన్ రెడ్డి, షర్మిలలు చేసిన పాదయాత్రల్లో, ఇటీవల రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలోగాని, దశలవారీగా తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్రలో ఇలాంటి అడ్డంకుల్లేవు, ఇంతటి నిర్బంధకాండ లేదు..మరెందుకీ జగన్ రెడ్డి ప్రభుత్వం యువగళంపైనే ఇంత నిర్బంధం అమల్జేసిందంటే నారా లోకేశ్ పట్ల భయం తప్ప మరేం కనబడటంలేదు. ఆయన అడుగేస్తే తన కుర్చీ కదిలిపోతుందనే జగన్ భయమే ఈ నిర్బంధకాండ వెనుక అసలు కారణం..
ఈ ఆటంకాలు, నిర్బంధం వల్లే యువగళం ఇంత పెద్దఎత్తున విజయవంతం అయ్యిందనడంలో సందేహం లేదు. మిగిలిన పాదయాత్రల్లా చూసీచూడనట్లు వదిలేస్తే ఇంత ఆసక్తి, ఉత్కంఠ ప్రజల్లో ఉండేవి కావేమో..బంతినెంత బలంగా నేలకు కొడితే అంత ఎత్తుకు ఎగిరినట్లు, లోకేష్ పాదయాత్రపై ఎన్ని అడ్డంకులు పెడితే ప్రజల్లో అంత ఆదరం పెరిగిందన్నమాట..ఏ యువ నాయకుడినీ ఇంతగా అణిచేసిన దాఖలాలేదు, ఇంత బురద జల్లిందీ లేదు..ప్రత్యర్ధుల అణిచివేత నుంచీ లోకేశ్ ఎదిగిన తీరు నిజంగా అభినందనీయం..యువగళం పాదయాత్రకు ముందు, తర్వాతగా నారా లోకేశ్ ఎదుగుదల చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు..