ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక రంగంలో 2026 సంవత్సరం స్వర్ణయుగంగా నిలిచిపోనుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మెగా ప్రాజెక్టులు ఈ ఏడాది పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నారు. ఈ ఏడాది గ్రౌండింగ్ కానున్న కీలకమైన ప్రాజెక్టులలో అమరావతి క్వాంటం వ్యాలీతో పాటు విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్, రామాయపట్నం BPCL మెగా రిఫైనరీ, ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్, AM గ్రీన్ అల్యూమినియ స్మెల్టర్ కాంప్లెక్స్ ఉన్నాయి.
అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికే దిక్సూచిగా నిలవనుంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ కార్యకలాపాలు ఈ ఏడాది అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS) వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో, 156-క్యూబిట్ సూపర్ కంప్యూటర్ అమరావతిలో కొలువుదీరనుంది. ఇది కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా, దాదాపు లక్ష మంది యువతకు టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. డీప్-టెక్ హబ్‌గా అమరావతి ప్రపంచ పటంలో నిలవడానికి ఇది తొలి అడుగు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక విశాఖలో గూగుల్ క్లౌడ్ తన కార్యకలాపాలను ముమ్మరం చేయనుంది. సుమారు $15 బిలియన్ల భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా, ఈ ఏడాది నుంచి క్లౌడ్ మరియు AI మౌలిక సదుపాయాల పనులు వేగవంతం కానున్నాయి. మరోవైపు, TCS శాశ్వత క్యాంపస్ పనులు ప్రారంభం కావడం, తాత్కాలిక సెంటర్ ద్వారా 2,000 మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలవ్వడం విశాఖ ఐటీ రంగానికి కొత్త ఊపునివ్వనుంది.
నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో BPCL ఏర్పాటు చేయనున్న లక్ష కోట్ల రూపాయల గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పనులు 2026లో ఫైనల్ స్టేజ్‌కు చేరుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించగా, ఈ ఏడాది నిర్మాణ పనులు ఊపందుకుంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా GST ఆదాయం రావడమే కాకుండా, పెట్రో-కెమికల్ అనుబంధ పరిశ్రమలు వేల సంఖ్యలో ఏర్పడి స్థానిక ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయనున్నాయి.
నక్కపల్లి దగ్గర ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి స్టీల్ ప్లాంట్ ఏపీ పారిశ్రామిక రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా నిలవనుంది. సుమారు రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో సాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2026లో భూమి పూజ,నిర్మాణ పనులు పూర్తవుతాయి. పర్యావరణ అనుమతులు ఇప్పటికే దాదాపు ఖరారు కావడంతో, ఈ ఏడాది ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా సుమారు 20,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది.
పర్యావరణ హిత ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ నాయకుడిగా నిలిపేందుకు AM Green సంస్థ కాకినాడలో గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ కాంప్లెక్స్‌ను నిర్మించనుంది. రూ. 54,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో గ్రీన్ అల్యూమినియంతో పాటు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారు చేస్తారు. 2026లో ఈ ప్రాజెక్టు గ్రౌండింగ్ కావడం వల్ల గ్రీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం అవుతుంది. కేవలం పరిశ్రమలే కాకుండా, రైతులకు ఉపయోగపడే బయో-రిఫైనరీల నిర్మాణం కూడా జరగనుంది.











