ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఓ పథకంలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను భాగస్వామ్యం చేయనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందనుంది. ఈ మేరకు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.
ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా – PMSRI అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని పలు స్కూళ్లను తాజాగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఏపీలో ఏకంగా 935 స్కూళ్లను కేంద్రం ఎంపిక చేసింది. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఆయా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నారు. దీంతో కొత్త ఏడాదిలో ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే పీఎం శ్రీ పథకం ప్రధాన లక్ష్యమని ప్రధాని మోడీ ప్రకటించారు. రాష్ట్రాల CSలతో జరిగిన భేటీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ CS విజయానంద్ సమావేశం అనంతరం కీలక ప్రకటన చేశారు. పీఎం శ్రీ పథకం కింద రాష్ట్రంలోని 935 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. స్కూళ్లను మెరుగైన రీతిలో అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన, డిజిటల్ సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తామని ప్రకటించారు.
ఐతే ఈ స్కూళ్ల ఎంపిక వెనుక నారా లోకేష్ కృషి స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టుబట్టి విద్యాశాఖను తీసుకున్న నారా లోకేష్..అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. పీఎంశ్రీ పథకంలో దక్షిణాదిన అత్యధిక పాఠశాలలు ఏపీ నుంచే ఎంపిక కావడం ఆయన పనితీరుకు నిదర్శనం. పలు మార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ ఏపీలో అవలంభిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వానికి వివరించారు. అంతేకాదు, అవసరమైన తోడ్పాడు అందించాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ విజ్ఞప్తి మేరకు కేంద్రం పీఎంశ్రీ పథకంలో ఏపీకి పెద్ద పీట వేసింది.











