అందం .. అభినయం మాత్రమే కాదు అంచెలంచెలుగా ఎదగాలంటే అదృష్టం కూడా కలిసిరావాలి. నూతిలో పడాల్సిన రొట్టెముక్క నేతిలో పడటమే అదృష్టమంటే. కానీ రష్మిక చేతిలోని రొట్టెముక్క ఇప్పుడు సరాసరి తేనెలోనే పడిపోయిందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అసలు రష్మిక ఎంట్రీ .. ఆమె ఖాతాలో చేరిన సక్సెస్ లు చూస్తేనే అదృష్టానికి ఆమె కజిన్ సిస్టర్ అనే విషయం అర్థమైపోతుంది. ఇంతకీ ఆమెను వెతుక్కుంటూ వచ్చిన అంతటి అదృష్టం ఏంటబ్బా? అనేదేగా మీ డౌట్ .. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ అనేదే అందుకు ఆన్సర్.
త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నాడు. తన వైపు నుంచి ఒక కథకి కావలసిన అన్ని అంశాలు జోడిస్తూనే, మరో వైపున ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశించే అంశాలను పుష్కలంగా సర్దేస్తున్నాడు. త్రివిక్రమ్ ఇంతకుముందు చేసిన ‘అరవింద సమేత’ .. ‘అల వైకుంఠపురములో’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను సెట్ చేశాయి. దాంతో ఆయన హ్యాట్రిక్ హిట్ కి రెడీ అవుతున్నాడు. తనతో పాటు పూజా హెగ్డేకి కూడా హ్యాట్రిక్ హిట్ ఇవ్వనున్నాడనే టాక్ వచ్చింది.
సాధారణంగా త్రివిక్రమ్ తన హీరోయిన్లను రిపీట్ చేస్తుంటాడు. అలాగే వరుసగా రెండుసార్లు పూజా హెగ్డేకి ఛాన్స్ ఇచ్చిన ఆయన, తాజా సినిమాలోను ఆమెకి అవకాశాన్ని ఇస్తున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాలో రష్మిక మందనను ఆయన తీసుకున్నట్టుగా ఒక వార్త బలంగా వినిపిస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ .. ‘భీష్మ’ సినిమాల సక్సెస్ తో మంచి ఊపుమీదున్న రష్మిక, ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉంది. ‘పుష్ప’తో ఆమె హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే అంటున్నారు. అదే నిజమైతే ఆమె పంట పండినట్టే!