ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు ప్రకటించడంతో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ రూ.15 వేల కోట్లే కాకుండా.. భవిష్యత్తులో మరిన్ని నిధులు సమకూరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అమరావతి దిశ దశ మారేందుకు మరెంతో కాలం పట్టదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా దిక్కు లేకుండా పడి ఉన్న అమరావతి ప్రాంతం కేంద్రం సహకారంతో త్వరలోనే కళకళలాడనున్నట్లు చెబుతున్నారు. నిజానికి అమరావతి పునర్ని ర్మాణానికి రూ.50 వేల కోట్లుకుపైగా అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి తొలి కేటాయింపులు జరిగాయి. భవిష్యత్తులోనూ ఆర్థిక సాయంపై కేంద్రం భరోసా ఇచ్చినందున ఇక అమరావతి ఊహించనంత వేగంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు.
ఈ దెబ్బతో ఏపీ రాజధాని అమరావతికి వందల కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపనున్నాయి. ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి ప్రాజెక్టు నుంచి కేంద్రం వెనక్కు తగ్గడంతో ఏపీ బ్రాండ్‌ను తీవ్రంగా దెబ్బతిన్నది. రుణాలిచ్చేందుకు ఆర్థిక సంస్థలు వెనక్కిపోగా.. కనీసం పెట్టుబడులు పెట్టేందుకు సైతం ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతో ఎవరూ కనీసం అమరావతి వైపు చూడలేదు. అప్పటి ఏపీ ప్రభుత్వ నిలకడ లేని నిర్ణయాలు, తుగ్లక్ ఆలోచనలకు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు జంకే పరిస్థితి ఉండేది.
కానీ, చంద్రబాబు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన రూ.15 వేల కోట్లతో పెట్టుబడి దారుల్లోనూ బోలెడంత విశ్వాసం ఏర్పడింది. ఫలితంగా ఈసారి అమరావతిలో పునర్ నిర్మాణం వైభవంగా ముందుకు సాగనుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచింది. ఎవరు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినా.. వారికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని గతంలోనే మంత్రి నారా లోకేశ్ ప్రకటించి ఉన్నారు. దీంతో గతంలో టీడీపీ ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓయూలు, ఇతర ఒప్పందాల్లో ఇప్పుడు కదలిక వస్తుందని అంటున్నారు. అలా ఏకంగా 3 వేల కంపెనీల దాకా అమరావతిలో తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇలా అమరావతిలో జరిగే పురోగతి చూసి అక్కడ పెట్టుబడులకు ప్రపంచ స్థాయి రుణ సంస్థలు, పెట్టుబడిదారులు మరింతగా ఆసక్తి చూపే అవకాశాలు లేకపోలేదు. అలా విదేశీ రుణ సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక రంగంలో కూడా కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. మొత్తానికి రాబోయే ఏడాదిలోనే అమరావతి రూపురేఖలు పూర్తిగా మారతాయని ఆశిస్తున్నారు.