జగన్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చేసింది. దాదాపు 47 రోజుల పాటు సాగిన ఈ క్రీడా ఉత్సవాల్లో ప్రజా ధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో వివరిస్తూ వేల పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో రూ. 40 కోట్ల నుంచి రూ. 60 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కుంభకోణంలో ప్రధానంగా క్రీడా సామాగ్రి సరఫరాలో జరిగిన మోసాన్ని చూసి విజిలెన్స్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను వాడి, అత్యంత నాణ్యత లేని బ్యాట్లు, బంతులు, టీ-షర్టులను క్రీడాకారులకు అంటగట్టినట్లు విచారణలో తేలింది. అసలైన కిట్లను పక్కదారి పట్టించడమే కాకుండా, విజేతలకు అందాల్సిన ప్రైజ్ మనీని కూడా నొక్కేసినట్లు ఆధారాలు లభించాయి. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిధులు కేటాయించడం వెనుక ఉన్న మతలబును కూడా అధికారులు నివేదికలో గణాంకాలతో సహా పొందుపరిచారు.
కేవలం అవినీతికే పరిమితం కాకుండా, క్రీడా స్ఫూర్తిని కూడా వైసీపీ నేతలు ఖూనీ చేశారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. అర్హులైన క్రీడాకారులను కాదని,రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కార్యకర్తలనే విజేతలుగా ఎంపిక చేసినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రభుత్వం మారే టైంలో కొందరు అధికారులు కంప్యూటర్లలోని డేటాను డిలీట్ చేసి సాక్ష్యాలను తుడిచివేయాలని ప్రయత్నించినా, విజిలెన్స్ విభాగం పట్టు వదలకుండా రికార్డులను వెలికితీసి ఈ అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది.
ఈ మొత్తం వ్యవహారంలో మాజీ క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి SAAP ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నివేదిక సీఎం ఆఫీసుకు చేరింది. త్వరలోనే కేసును ACB లేదా CIDకి అప్పగించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. 10 వేల పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్టులో ప్రతి రూపాయి లెక్కను అధికారులు పక్కాగా రాశారు. ఆధారాలు బలంగా ఉంటే, మాజీ మంత్రి రోజా మరియు బైరెడ్డిలకు అరెస్టులు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.











