మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి బూతులు మాట్లాడిన కేసులో అంబటి రాంబాబు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉన్న అంబటిని తాజాగా పోలీసులు గుంటూరుకు తరలించారు. పాత కేసులకు సంబంధించి పీటీ (ప్రొడక్షన్ ట్రాన్సిట్) వారెంట్‌పై పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ భద్రత నడుమ ఆయనను రాజమహేంద్రవరం నుంచి గుంటూరు కోర్టుకు తీసుకెళ్లారు.
గతేడాది నవంబర్ 12న వైద్య కళాశాలల పీపీపీ (PPP) విధానానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో పట్టాభిపురం పోలీసులు అప్పట్లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పాత కేసులో విచారణ నిమిత్తం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను గుంటూరుకు తరలించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.
మరోవైపు, అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు, ఆయనను విచారించేందుకు పోలీసులు కోరిన కస్టడీ పిటిషన్‌పై కూడా కోర్టులో విచారణ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంబటికి బెయిల్ లభిస్తుందా లేక పోలీసు కస్టడీకి అనుమతి లభిస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పును బట్టి ఆయన తిరిగి రాజమహేంద్రవరం వెళ్తారా లేదా అన్నది తేలనుంది.











