చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకునికి బుధవారం రికార్డ్ స్థాయి విరాళం వచ్చింది. ప్రవాస భారతీయుడు ఒకరు ఒక లక్ష డాలర్లను విరాళంగా ఇచ్చారు. డాలర్ల విలువను ప్రస్తుత ఇండియన్ కరెన్సీతో పోలిస్తే సుమారు 74 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంత భారీ విరాళం, కానుక కాణిపాకం వినాయకునికి గతంలో ఎన్నడూ రాలేదు.
ఆ అజ్ఞాత భక్తుడి కోరిక మేరకు ఇందులో అన్నదాన ట్రస్ట్ కు 50 వేల డాలర్లు, గో సంరక్షణ ట్రస్టుకు 50 వేల డాలర్లను ఆలయం ఖాతాలో జమ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఓ భక్తుడు విరాళం ఇవ్వడం కాణిపాక ఆలయ చరిత్రలో ఇదే ప్రథమమన్న ఆలయ ఈవో వెంకటేశులు.
ప్రమాణాల దేవుడు
వరసిద్ధి వినాయకుడు స్వయంభువు. ఆయన ప్రమాణాల దేవుడుగా పేరుగాంచాడు. రెండు తెలుగురాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కాణిపాకం వినాయకుని మహిమలు ప్రఖ్యాతి గాంచాయి. కాణిపాకంలో ప్రమాణం చేసి అబద్ధం చెప్పాలంటే.. ఎంతటి వారైనా జడుసుకుంటారు. అక్కడ ప్రమాణం చేయడాన్ని రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో సవాలుగా విసురుతుంటారు.












