ఎంత బలవంతుడైనా సరే.. స్నేహితులు లేనోళ్లను చూశారా? ఆ మాటకు వస్తే.. బలవంతుడికి సైతం మిత్రులు మరింత బలం చేకూరేలా చేస్తారు. ఆ చిన్న విషయాన్ని మోడీ , షాలు ఎందుకు మిస్ అవుతున్నారన్నది అసలు ప్రశ్న. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు అంత పెద్ద లోక్‌సభలో రెండు అంటే రెండు ఎంపీ సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగిన బీజేపీ.. ఎప్పుడైనా.. ఇప్పుడున్న స్థాయికి చేరుకుంటామన్న కల అయినా కన్నారా? అన్నది క్వశ్చనే.
ఒక్క ఓటు తేడాతో..
ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని చేజార్చుకున్న వేళ.. వాజ్ పేయ్ ప్రభుత్వం పడిపోవటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఓటు కోసం ఎలాంటి ప్రలోభాలకు దిగకుండా నిజాయితీగా వ్యవహరించటమే నాడు కమలనాథులు చేసిన తప్పుగా పలువురు పేర్కొనే వారు. అదే సమయంలో కేంద్రంలోని ప్రభుత్వం కూలిపోకుండా ఏ ఒక్కరూ ముందుకు రాలేదే? అన్న సందేహం పలువురికి కలిగింది. తమకు తగ్గట్లుగా మిత్రుల్ని సంపాదించుకోవటంలో బీజేపీ ఎందుకు వెనుకబడుతుందన్న ప్రశ్న పలువురిని తొలిచేది.
లెక్క తేడా వచ్చినప్పుడే..
అప్పుడేమో మిత్రులు లేని పరిస్థితి. ఇప్పుడేమో ఉన్న మిత్రుల్ని కోల్పోతున్న దుస్థితి. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. బలాన్ని సొంతం చేసుకున్నంత మాత్రానా మిత్రుల్ని వదిలేసుకోవటమా? అన్ని బాగున్నప్పుడు చాలా విషయాలు చిన్నవిగా కనిపిస్తుంటాయి. కానీ, ఒకసారి లెక్క తేడా వచ్చినప్పుడే.. గత తప్పులు శాపాలుగా మారటమే కాదు కోలుకోకుండా చేస్తాయి.
బీజేపీ డబుల్ గేమ్
శివసేన లాంటి విశ్వసనీయమైన మిత్రుడ్ని.. ఒక రాష్ట్రంలో అధికారాన్ని పంచుకోవటానికి ఇష్టం లేక చేజార్చుకోవటం ఒక ఉదాహరణగా చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న బిహార్ ఎన్నికల్లోనూ బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ చూసినప్పుడు బీజేపీ ఏ మాత్రం నమ్మదగిన మిత్రుడు కాదన్న విషయం చాలామందికి అర్థమైంది. ఇలాంటి తప్పులు ఇప్పటికిప్పుడు ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ఈ తరహా తప్పులకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మోడీ, షాలు మిస్ కావటం విస్మయాన్ని రేకెత్తించకమానదు.
రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవటాలు సహజం
రాజకీయాలన్నాక ఇచ్చిపుచ్చుకోవటాలు సహజం. ఎంత పెద్ద పార్టీకైనా సరే.. అన్ని రోజులు ఒకలా ఉండవన్నది మర్చిపోకూడదు. కలిసి వచ్చిన మిత్రులతో కలుపుగోలుగా వ్యవహరించటం మానేసి, పొగ బెట్టి పంపేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోయే వారు పోనీ అన్నట్లుగా వదిలేస్తున్న మోడీ, షాలు.. మిత్రులకు ఏ మాత్రం అనువుగా ఉండని రాజకీయ పార్టీ అన్న ఇమేజ్‌ను తీసుకురావటంలో సక్సెస్ అవుతున్నారని చెప్పక తప్పదు.










