(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది, అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయనగరం ఎమ్మార్ డిగ్రీ కాలేజీని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఆ కళాశాలను సందర్శించిన ఆర్జేడీ డేవిడ్ కుమారస్వామి అందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో స్థానికుల అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
అన్ ఎయిడెడ్ చేస్తే ..
జిల్లాలో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యకు మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాల ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ విద్యాలయం ప్రైవేటీకరణ అంశంతో వేలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఇంటర్ విభాగాన్ని ఎత్తివేశారు. డిగ్రీ విద్యను ఎయిడెడ్ నుంచి తప్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 2020-21ని శూన్య విద్యాసంవత్సరంగా ప్రకటించి ప్రవేశాలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లా కేంద్రంలో కళాశాల ఉండటంతో చదువుతో పాటు విజ్ఞానం, సమాచారం ఇతరత్రా రూపాల్లో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండటంతో యువత చేరేందుకు అవకాశం కలుగుతోంది. 100 మంది కేడెట్లతో ఒక ఎన్సీసీ, నాలుగు ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవాపథకం) యూనిట్లు ఉన్నాయి. వీటిలో చేరడం ద్వారా ఏటా సాయుధదళాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. విజయనగరంలో ఉద్యోగ శిక్షణ కేంద్రాలు ఎక్కువ. చదువుతో పాటు ఉద్యోగాలకు సాధన చేసుకోవడానికి అనువుగా ఈ కళాశాల ఉంది. పోటీ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఈ కళాశాల విద్యార్థులు ఎంపికవుతున్నారు. గతేడాది కాలంలో 273 మంది ప్రాంగణ నియామకాల్లో, 25 మంది సచివాలయాల్లో మహిళా పోలీసులు, 12 మంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపికయ్యారు. మౌలిక సదుపాయాలు ఇక్కడ ప్రత్యేకత. అధునాతన ప్రయోగశాలలు, గ్రంథాలయం, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఈ కళాశాల సొంతం. అందువల్లే ఏయూ, అంబేద్కర్ విశ్వవిద్యాలయాల అధ్యయన కేంద్రాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. విజయనగరంలో పదికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలున్నాయి. వీటిలో ఉంటూ కళాశాలలో చదువుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. కళాశాలలో చదివిన వారిలో 70 శాతం మంది ప్రభుత్వ వసతి గృహాల నుంచి వచ్చినవారే ఉన్నారు. కళాశాల పరంగా బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సీట్లు రాని వారు ఇక్కడ నామమాత్ర రుసుముతో చేరుతారు. నాక్ బి గ్రేడ్, పరీక్ష విధానంలో స్వయం ప్రతిపత్తి (అటానమస్) ఉండటం, ఎక్కువ మంది డాక్టరేట్, ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకులు ఉండడం ఈ కళాశాల విశిష్టత. దీన్ని అన్ ఎయిడెడ్ చేస్తే ఈ సౌకర్యాలన్నీ కోల్పోతుంది. విద్యార్థులకు పెనుభారం అవుతుంది.
Must Read ;- ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసన.. అట్టుడికిన విజయనగరం
అగ్రభాగం ప్రభుత్వ నిధులదే ..
ఎమ్మార్ కళాశాలకు నాక్ ‘బి’ గ్రేడ్ గుర్తింపు ఉండటంతో ప్రభుత్వ నిధులకు అవకాశమెక్కువ ఉంది. ఏడాదికి ఎయిడెడ్ వారికి జీతాల రూపంలో రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి వస్తోంది. అన్ఎయిడెడ్లో ఉన్న అధ్యాపకులు, సిబ్బంది జీతాలకు అదనంగా కోటి రూపాయల వరకూ ట్రస్టు భర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పాత భవనం మినహా మిగిలిన భవనాలు యూజీసీ, ఆర్థిక సంఘం, రూసా నిధులతో నిర్మించినవే. 2019-20లో రూసా పథకంలో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. తొలివిడతగా కోటి రూపాయలు విడుదల కాగా ఆనంద గజపతి కళాక్షేత్రం సమీపంలో ఉన్న బాలికల వసతి గృహం పైభాగంలో కొత్తగా భవనం నిర్మించారు. రూ.60 లక్షలతో బోధనోపకరణాలు సమకూర్చారు. మిగిలిన రూ.40 లక్షలతో పాత భవనంలో కొంతభాగం మరమ్మతులకు అవకాశం కల్పించారు. అగ్రభాగం ప్రభుత్వ నిధులే కావడంతో కళాశాలను సర్కారు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని స్థానికులు ప్రశిస్తున్నారు.
ఉన్నత విద్యామండలి కమిటీ పరిశీలన
మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలను ఉన్నత విద్యామండలి విలువ మదింపు కమిటీ ఇటీవల పరిశీలించింది. సాలూరు నోడల్ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు టి.రాధాకృష్ణ, ఏపీఐడబ్ల్యూడీసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంక్షేమ అభివృద్ధి సంస్థ) ఇంజినీరింగ్ అధికారి సత్యనారాయణ, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు కమిటీలో ఉన్నారు. కళాశాలలో యూజీసీ, రూసా నిధులతో నిర్మించిన భవనాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మౌలిక సదుపాయాల తీరు, కొనుగోలు చేసిన పరికరాలను పరిశీలించారు. కళాశాలకు ఏ సంవత్సరంలో ఎంత గ్రాంటు వచ్చింది? అందులో ఎన్ని నిధులు విడుదలయ్యాయో తెలుసుకున్నారు. కళాశాల ఎయిడెడ్ను ప్రభుత్వానికి సరెండర్ చేసే విషయంపై కూడా అధ్యయనం చేసినట్లు ఎమ్మార్ అధ్యాపక వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఎంత మంది పనిచేస్తున్నారు? వీరికి ఎంత మొత్తంలో జీతాలు చెల్లిస్తున్నారన్న విషయమై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. చివరగా ఎయిడెడ్ అధ్యాపకులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎయిడెడ్ సరెండర్ ప్రభుత్వ నిర్ణయమని వారికి సూచించినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో అవసరమైన చోట సర్దుబాటు చేస్తామని సూచించినట్లు చెబుతున్నారు.
ఇప్పుడు ఆర్జేడీ పరిశీలన ..
రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రాంతీయ పరిశీలకులు (ఆర్జేడీ) ఆర్. డేవిడ్ కుమారస్వామి శుక్రవారం పరిశీలించారు. ఎమ్మార్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశమైనట్లు, అన్ ఎయిడెడ్కు ఉన్న అవకాశాలను కూలంకషంగా పరిశీలించినట్లు తెలిసింది.
వినతుల వెల్లువ
ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్ కళాశాలను ప్రైవేటీకరించ వద్దని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆర్జేడీకి వినతులు ఇచ్చారు. ఎమ్మార్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
Also Read ;- ఎవరి రాజకీయం వారిది.. ఎమ్మార్ కాలేజీ భవిష్యత్తు ఏమిటి?











