మహానగరంలో ఘరానా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బును సంపాధించేందుకు ఈజీ రూట్లను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్రైమ్ చేసే తమ పంథాను మార్చుకుంటున్నారు. కిడ్నాపర్లు, నేరస్థులు ఎక్కడో ఉండటంలేదు. మన దగ్గరలో.. మన మధ్యే.. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లోనే అద్దెకు ఉంటూ కిడ్నాప్‌లకు స్కెచ్ వేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని శామీర్‌పేట, రాజేంద్రనగర్‌లో తాజాగా జరిగిన ఈ రెండు ఘటనలే దీనికి నిదర్శనం. హైదరాబాద్ నగరంలో తమకు నచ్చిన ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుంటూ కొందరు క్రైమ్ లకు పాల్పడుతున్నారు.
మన మధ్యలోనే నేరస్థులు..
హైదరాబాద్ నగరంలోని శామీర్‌పేటలో బీహార్ వాసి అక్కడే అద్దెకు ఉంటూ ఓ బాలుడిని షేర్ చాట్ స్కిట్ పేరుతో కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. బీహార్ వాసి అయిన సుదర్శన్ శర్మ షేర్‌చాట్‌లో స్కిట్ చేయించేందుకు అభియాన్‌ను తన వెంట తీసుకెళ్లాడు. అక్కడే అద్దెకు ఉంటుండటంతో ఆ బాలుడు తనతో కూడా వెళ్లాడు. బాలుడు అభియాన్‌తో సుదర్శన్‌శర్మ జంపింగ్ స్కిట్ చేయించాడు. అయితే స్కిట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడికి గాయాలయ్యాయి. అభియాన్ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే తనపై ఎక్కడ దాడి చేస్తారని భయపడ్డ సుదర్శన్‌శర్మ.. బాలుడి తల్లిదండ్రులకు కాల్ చేసి బాలుడు తన వద్దే ఉన్నాడని, అప్పగించాలంటే తనకు రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కంగారు పడ్డ ఆ ఐదేళ్ల అభియాన్ తల్లిదండ్రులు వెంటనే శామీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో సుదర్శన్ శర్మ ఆ బాలుడిని ఓ గదిలో తీసుకెళ్లి హత్యచేశాడు.
అలాగే రాంజేద్రనగర్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులోనూ తన ఇంటిపైన అద్దెకు ఉంటున్న ఖలీద్ అనే వ్యక్తే డాక్టర్‌ను కిడ్నాప్ చేశాడు. డబ్బుల కోసం డాక్టర్ ఇంటిపై అద్దెకు ఉండే కిరాయిదారునితో డాక్టర్ హుస్సేన్ దగ్గరి బంధువు అయినా ముస్తఫా అనే వ్యక్తి కిడ్నాప్ చేయించినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డాక్టర్ కుటుంబ సభ్యులకు ఆ కిడ్నాపర్లు ఫోన్ చేశారు. ఈ ఘటనలో తెలంగాణ, ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి డాక్టర్ హుస్సేన్‌ను కాపాడగలిగారు. ఈ రెండు ఘటనల్లోనూ కూడా అద్దె ఇంట్లో ఉంటూ నమ్మకంగా క్రైమ్ లకు పాల్పడిన విషయం గమనార్హం.
వివరాలు ఆరా తీయాలి..
ఈ రెండు ఘటనలే కాదు గంజాయి, వ్యభిచారం, డ్రగ్స్ లాంటి చాలా దందాలు ఇంటి యజమానులకు తెలియకుండా అద్దె ఇంట్లో ఉంటూ కొంత మంది నగరంలో చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇలాంటి ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఎవరికైనా తమ ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే వాళ్ల ఊరు, పేరు, ఏం చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్లు ఎలాంటి వారు, వారి వివరాలు గట్రా అన్ని తెలుసుకుని ఇస్తే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. లేకుంటే అపాయంలోకి పడక తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.










