టాలీవుడ్ యంగ్ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ది డిఫరెంట్ స్టైల్. దాదాపు అందరు టాప్ మోస్ట్ హీరోయిన్స్ తోనూ రొమాన్స్ చేసిన ఈ హీరోకి చెప్పుకోదగ్గ రీతిలో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ‘రాక్షసుడు’ సూపర్ హిట్ మాత్రం అతడికి కాస్తంత రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్న బెల్లంకొండ బాబుకి.. లక్ మరో విధంగా కలిసి వస్తోంది. అదేంటంటే.. అతడు తెలుగులో నటించిన మూవీస్ హిందీ డబ్బింగ్ రూపంలో యూ ట్యూబ్ లో విడుదలవగా… వాటికి మిలియన్స్ వ్యూస్ వచ్చి పడుతున్నాయి.
దాదాపు బెల్లంకొండ ఫ్లాప్ మూవీస్ అన్నీ యూట్యూబ్ లో విడుదలయ్యాయి. అయితే అనూహ్యంగా అవన్నీ సెన్సేషనల్ హిట్స్ అయిపోయాయి. మొన్నామధ్య ‘జయ జానకీ నాయక’ మూవీ హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకొని బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక కాజల్ తో నటించిన ‘సీత’ సినిమా కూడా యూ ట్యూబ్ లో బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా దాదాపు 170 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది. దాంతో బెల్లంకొండ శ్రీను కు నార్త్ లో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ బలపడుతోందని ప్రూవ్ అయింది. అందుకే అతడి క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ రంగంలోకి దిగుతున్నాడట.
ప్రభాస్ , రాజమౌళి తొలి కాంబో మూవీ ‘ఛత్రపతి’పై ఆ ప్రొడ్యూసర్ కన్ను పడిందట. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఆ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో బాలీవుడ్ లో రీమేక్ చేయాలన్నది అతడి ప్లానట. ప్రభాస్ కు టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఛత్రపతి ఒకటి. ఇందులోని అతడి పాత్రకి, రాజమౌళి స్టైలాఫ్ మేకింగ్ కు సరిగ్గా సరిపోయింది. మరి అదే మ్యాజిక్ బెల్లంకొండ మీద బాలీవుడ్ లో వర్కవుట్ అవుతుందో లేదో చెప్పలేం. మరి ఈ సినిమాతోనే అతడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.











