అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఈ నెల 20 భారీ సభ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ అమరావతి రైతులకు అండగా నిలిచిందని, రాజధాని అమరావతిలోనే ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆయన వెల్లడించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో భారీ సభ నిర్వహించి అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీబావం తెలుపుతామని మస్తాన్ వలీ గుంటూరులో మీడియాకు వెల్లడించారు.
సవాంగం అన్న అనుమతి ఉందా
అమరావతి రాజధాని గ్రామాల్లో ఎలాంటి సభలు నిర్వహించాలన్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఒక రాజధానిలోనే కాదు ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న సమావేశానికి అసలు పోలీసులు అనుమతిస్తారా? అనే అనుమానం కూడా ఉంది.
అయితే రాష్ట్ర విభజనతోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయి. ఆ పార్టీని నమ్ముకుని కొందరు నేతలు కష్టపడుతున్నారు. కానీ ఏపీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల కన్నా నాయకులే ఎక్కువగా ఉన్నారని జనం కామెడీగా చెప్పుకుంటున్నారు. అంటే ఏపీ కాంగ్రెస్ లో నాయకులు మిగిలిపోయారు. కానీ ఓటర్లు మాత్రం ఎప్పుడో వైసీపీలో చేరిపోయారు. ఒక వేళ అమరావతి రాజధానిలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తే రైతుల నుంచి మద్దతు దక్కే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకునే అమరావతి రాజధానిలో కాంగ్రెస్ పార్టీ భారీ మీటింగ్ నిర్వహించాలని, ఆ రకంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
వినడానికే వింతగా ఉంది
ఏపీలో కాంగ్రెస్ పార్టీ భారీ సభలు పెట్టే రోజులు రాష్ట్ర విభజనతోనే పోయాయి. అయితే తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు అమరావతి రాజధానిలో ఓ సమావేశం నిర్వహిస్తే ప్రజల నుంచి, ముఖ్యంగా అమరావతి రాజధాని గ్రామాల రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దామనే ఉద్దేశంతో ఈ నెల 20న మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. అయితే చనిపోయిన వారికి ఎంత వైద్యం చేసినా లేచిరావడం ఎంత అసాధ్యమో, అమరావతి రాజధానిలో కాంగ్రెస్ మీటింగ్ సక్సెస్ కావడం కూడా అంతే కష్టం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. ఇక ఆ పార్టీకి ఆక్సిజన్ అందించడం శుద్ద దండగ. అయినా కాంగ్రెస్ నేతలు ఓ ప్రయత్నం చేసి చూద్దామనే దోరణిలో ఉన్నారని రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరే వారి ప్రయత్నాలను మనం ఎందుకు కాదనాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటారుగా.. చూద్దాం ఏం జరగనుందో..!
Also Read ;- నవ్యాంధ్ర రాజధాని అమరావతి వాస్తు.. వాస్తవాలు











