నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో చాలా గందరగోళ వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పడిన అమరావతి రాజధాని ఇప్పుడు మూడు భాగాలుగా మారిపోనుంది. ఈ రాజధాని వాస్తు విషయంలో వాస్తు పండితులు ఏమంటున్నారు? అమరావతి కి ఇలాంటి గడ్డు పరిస్థితులు ఏర్పడటానికి వాస్తు పరమైన కారణాలు ఏమిటి? అసలు అమరావతి వాస్తు ఎలా ఉంది? ఈ మూడు అంశాల గురించి తెలుసుకుందాం. కొంతమంది వాస్తు నిపుణుల అభిప్రాయాల మేరకే ఈ విశ్లేషణ ఉంటుంది.
రాజధాని ఏర్పాటులో లోపం ఉందా?
రాజధాని నగరంగా అమరావతి ఎంపిక కోసం చాలా కసరత్తులే జరిగాయి. అప్పట్లో రాజధాని నగర నిర్మాణానికి ప్రధానంగా రెండు పేర్లు వినిపించాయి. అందులో ఒకటి అమరావతి, ఇంకోటి దొనకొండ. ఈ రెండింటిలో ఏది మంచిదనే దానిపై కూడా వాస్తు పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక వర్గం వాస్తు రీత్యా అమరావతి బాగుంటుందని అంటే, ఇంకో వర్గం దొనకొండకు ఓటేసింది. తెలంగాణ ఏర్పడినప్పుడు నవ్యంధ్రకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల పాటు ఉంటుందని నిర్ణయించారు. ఈ ఉమ్మడి రాజధాని నుంచి అగ్నేయం వైపు ప్రయాణిస్తే అమరావతి వస్తుంది, దక్షిణ దిశగా ప్రయాణిస్తే దొనకొండ వస్తుంది.
ఆగ్నేయ దిశగా ప్రయాణం మంచిది కాదని వాస్తు చెబుతోంది కాబట్టి దొనకొండను రాజధానిగా చేస్తే మంచిదని కొందరు పండితులు అభిప్రాయ పడ్డారు. ఉత్తర గోగ్రహణంలో కౌరవులు ఆగ్నేయ దిశగా పయనించి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని కొందరు ప్రస్తావించారు. కానీ వాస్తు రీత్యా అన్ని హంగులూ అమరావతికి మాత్రమే ఉన్నాయి. పైగా ఉమ్మడి రాజధానిగా పదేళ్లు నిర్ణయించినా పాలన వ్యవహారమంతా అమరావతికి తరలిపోయింది. అలాంటప్పుడు ఆగ్నేయదిశగా ప్రయాణమంటూ ఉండదు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాస్తును అడ్డంగా పెట్టుకున్నారనేది అర్థమవుతోంది.
వాస్తులో పరిశీలించాల్సిన అంశాలు
వాస్తులో ప్రధానంగా నాలుగు అంశాలను పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అమరావతి నగర నిర్మాణం ఎలా ఉండాలి అనేది. ఇంకోటి ఆ నగర పరిసరాల వాస్తు. ఇక ప్రధానంగా నాలుగు దిక్కుల్లో వాస్తు శక్తులు.. వీటి ఆధారంగానే కొత్తగా నిర్మించే నగరానికి వాస్తును పరిశీలించాల్సి ఉంటుంది. వాస్తు అనేది వస్తువుకు సంబంధించిన పరిజ్ఞానం. నవ్యాంధ్రకు రాజధాని ఎక్కడ అనే అంశాలు పరిశీలనకు వచ్చినప్పుడే చాలామంది వాస్తు పండితులు రకరకాల విశ్లేషణలు చేశారు. ముఖ్యంగా దొనకొండ, అమరావతి, ఆగిరిపల్లి పరిసర ప్రాంతాలు పరిశీలనలోకి వచ్చాయి. ఈ మూడింటిలోనూ అమరావతి శ్రేష్టమైనదని అందరూ తేల్చారు.
అమరావతి నైసర్గిక స్వరూపం వాస్తుపురుషుడి రూపానికి చక్కగా సరిపోలుతుందన్న నిర్ణయానికి వచ్చారు. మరి ఇంత బలమైన వాస్తు ఉన్నప్పుడు అమరావతికి ఎందుకీ దుస్థితి అనే మాట కూడా మరో పక్క వినిపిస్తోంది. దేనికైనా బాలారిష్టాలు తప్పదు. అలా చూసుకున్నప్పుడు అమరావతి కూడా బాలారిష్టాల దశ దాటిరాలేదని చాలామంది పండితులు అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వాస్తు పండితుల అభిప్రాయం కూడా మారినట్టుంది. వైఎస్. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక రాజధాని ఆలోచన మారింది. అమరావతి కాస్తా మూడు రాజధానులుగా మారింది.
ప్రభుత్వం రాజధాని మార్పు ఆలోచన.. వాస్తు విశ్లేషణ
* అమరావతి నైసర్గిక స్వరూపం సరిగా లేదన్నది కొందరి వాదన. వారేమంటారంటే కృష్ణా నది ఉత్తరం నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా ప్రవహిస్తోంది. దాంతో రాజధానికి ఈశాన్యం తగ్గుతోందట. రాజధానికి ఈశాన్యాన కృష్ణా నది కోతకు గురై ఆగ్నేయం వైపు వెళుతోందట. రాజధానికి ఈశాన్యంలో కనకదుర్గ ఆలయం ఉందని కొందరు అప్పటి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారన్నది నేటి కొందరు వాస్తు పండితుల వాదన. అలాగే కొత్తగా నిర్మించే నగరానికి నాలుగు వైపులా స్థలం ఉండాలని, కానీ నదికి అవతల విజయవాడ అనే నగరం ఉందనేది మరో అంశం.
ఈ విశ్లేషణలో ఎంత మాత్రమూ నిజం లేదు. నదికి అవతల ఉండే నగరాన్ని ఎవ్వరూ పరిగణనలోకి తీసుకోరని మన పండితులు అంటున్నారు. పరిసరాల వాస్తు అనే అంశంలో కూడా నది అవతలి అంశాలు వాస్తు పరిధిలోకి రావు. కేవలం నది మాత్రమే వస్తుంది. పైగా ఆ నది రాజధాని అమరావతికి తూర్పు దిక్కున ఉంది. అసలక్కడ నగర నిర్మాణమే ఇంకా పూర్తికానప్పుడు నది ఈశాన్యం భాగం కోతకు గురై ఈశాన్యం లోపం ఉంటుందని ఎలా చెప్పగలం.
* నగర నిర్మాణానికి ఆయువు పట్టు నీటి వనరులు. ఆ నీటిలో పంటలే పండించుకోవాలట. ఇది వాస్తుకు సంబంధం లేని అంశం. వాస్తు శాస్త్రవేత్తలు వాస్తుకు సంబంధం లేని విషయాలను ఇక్కడ ప్రస్తావించకూడదు.
* రాజధానిలో నిర్మాణాలను చేపట్టే ముందు అక్కడి భౌగోళిక స్థితిగతులు, సమీపంలోని కొండలు, జలవనరులను పరిగణనలోకి తీసుకోవడం చేయాలి. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసేముందే అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు.
* ఈశాన్య పవనాలు పాజిటివ్ ఎనర్జీని తెస్తాన్న ఉద్దేశంతో అమరావతి నిర్మాణాలను అదే దిక్కుగా ప్రధాన ప్రవేశ మార్గాన్ని మాస్టర్ ప్లాన్‌లో ఏర్పరిచారు.
* వాస్తులో మరో కీలక అంశం బ్రహ్మస్థానం. మనిషికి నాభి ఎలాంటిదో ఈ బ్రహ్మస్థానం కూడా అలాంటిదే. ప్రతి నగరంలోనూ దాని మధ్య ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలి. అలాంటి జాగ్రత్తలు అమరావతికి తీసుకునే ఉంటారు.
* అమరావతి నగరానికి ఓ వైపు ఎత్తైన కొండలు, వాటికి ఎదురుగా నది ఉన్నాయి. వాస్తుకు ఇంతకంటే కావలసింది ఏమీ ఉండదు. కొండలు, నది ఈ రెండూ అమరావతికి ఆయువు పట్టు.
బాలారిష్టాల దశలోనే అమరావతి
బాలారిష్టాల దశ అనేది ఎవరికైనా తప్పదు. బిడ్డ పుట్టినప్పుడు కూడా బాలారిష్టాలు పోవడానికి గ్రహశాంతులు లాంటివి మనం చేస్తుంటాం. ఒక నగరం ఏర్పడాలన్నా ఇలాంటి శాంతులు తప్పదు. వాస్తు పూజలు లాంటివి మనం చేసేది కూడా అందుకే. 13 ఏళ్ల పాటు ఈ బాలారిష్టాల దశ ఉంటుంది. ఈ దశలో ప్రభుత్వాలు కూడా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ప్రభావం పాలకుల మీద కూడా పడుతుంటుంది. ఈ దశ దాటితే కొత్త నగరానికి పూర్వ వైభవం రాక తప్పదు. పైగా వాస్తు పూజలు, వాస్తు హోమాలు వంటివి జరిగిన ప్రాంతాన్ని విస్మరించడం కూడా ఏమీ మంచిది కాదు.
ఒక నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగాక దాన్ని నిలిపివేయడం కూడా అరిష్టదాయకం. రాజధాని మార్పు ఆలోచన చేసిన తర్వాత ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం ఉండదు. నగర నిర్మాణం మాత్రం ఆగకూడదు. ప్రస్తుతం అక్కడ చాలా నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అన్నీ వాస్తు పూజలు చేసి ప్రారంభించిన నిర్మాణాలే. అన్నింటి మీదా ఆ ప్రభావం పడుతుంది. అసలు ఏ కట్టడ నిర్మాణం అయినా ప్రారంభించిన తర్వాత మధ్యలో నిలిపివేయ కూడదు. వాటి నిర్మాణాన్ని పూర్తి చేసి తీరాలి. ఒకవేళ రాజధానుల మార్పు అనివార్యమని అనుకున్నా నిర్మాణాల పని మాత్రం కొనసాగాల్సిందే. కొత్త ప్రభుత్వం తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది.
వాటి అమలు దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ ప్రతిపాదనలు ఎలా ఉన్నా నగర నిర్మాణం మాత్రం ఆగకూడదు. వాటి నిర్మాణాన్ని కొనసాగిస్తే త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. అసలు ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారంటేనే వాస్తు బాగుంటేనే చేస్తారు. లేకుంటే దాని జోలికి వెళ్లరు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని వాస్తు లేకుండా ఎలా ఎంపిక చేస్తారు? కాబట్టి అమరావతి ప్రాంతానికి వాస్తు లోపం అంటూ ఏదీ లేదు. రాజధాని మార్పు ప్రతిపాదన వాస్తు లోపం కారణంగా వచ్చింది మాత్రం కాదు. శంకుస్థాపన చేసిన ముహూర్తబలం వల్ల అమరావతి నగరానికి కచ్చితంగా వైభవం వచ్చితీరుతుంది. అప్పటిదాకా ఈ బాలారిష్టాలు మాత్రం తప్పదు.