సాధారణంగా మనం ఏదైనా పోగొట్టుకుంటే.. వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాం. వారికి కంప్లైంట్ ఇస్తే పోగొట్టుకున్న వస్తువు తిరిగి మనకు చేరుస్తారనే నమ్మకం. కానీ, అటువంటి రక్షక భటులే ప్రజలను మోసం చేస్తే పోలీసులపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతుంది. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పే వారిని నమ్మకండి అంటూ ప్రజలకు హితవు చెప్పాల్సిన పోలీసులు, ఉద్యోగాల పేరు చెప్పి జనాలను మోసగించారు. చివరికి మోసం బయటపడటంతో దొంగలను కటకటాల వెనుక పెట్టాల్సిన పోలీసులే జైలు పాలయ్యారు.
ఉద్యోగాలంటూ నమ్మబలికారు
బి. మనోజ్ కుమార్, ఏ రమణ, బి.హరికృష్ణ విశాఖపట్నంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ జరిగింది. అందులో ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఎందరో నిరుద్యోగులు ప్రయత్నించారు. దానిని అవకాశంగా భావించిన ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు కొందరు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపించారు. నిరుద్యోగులు వీరి మాటలను నమ్మారు. పైగా చెప్తున్నది పోలీసులు కావడంతో ఎటువంటి మోసం ఉండదని భావించారు. కానీ అక్కడే వారు పొరపాటు పడ్డారు.
పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు
ఇదే అదనుగా భావించిన పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇక తమకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కొంత కాలం గడిచినా వారికి ఉద్యోగాల గురించి ఎటువంటి సమాచారం అందలేదు. వారు డబ్బులిచ్చిన కానిస్టేబుల్స్‌ని అడిగితే సమాధానం లేదు. దీంతో తమను ఉద్యోగాల పేరుతో పోలీసులు మోసం చేశారని గ్రహించారు. ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు తమను మోసం చేసారంటూ అదే శాఖకు చెందిన వారికి కంప్లైంట్ ఇచ్చారు. నిరుద్యోగుల నుండి ఫిర్యాదు అందుకున్న వారు ఈ ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇలాంటివి ఎన్ని జరిగినా ..
ఉద్యోగాలు డబ్బులకు దొరికే వస్తువులు కాదు, కొనేసుకుందాంలే అనుకోవడానికి. దానికంటూ ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రకారం వెళ్లినపుడే అంతా సజావుగా సాగుతుంది. ఈ సంఘటన కొత్తదేమీ కాదు. ఇలాంటి వ్యవహారాలు ఎన్నో వెలుగు చూస్తున్నా కూడా ప్రజలు వాటిని గ్రహించడంలో విఫలమవడం వల్లే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చేసినా… ప్రజలు అప్రమత్తంగా లేనంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి ఎదురైనపుడు వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ఒకవేళ పోలీసులే మోసగిస్తే ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేయండి, అంతేకానీ డబ్బును పోగొట్టుకోకండి.











