( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి )
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది అనేక పండుగులకు ప్రజల దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ దీపావళి వచ్చేసరికల్లా లాక్ డౌన్లు ఎత్తివేయడం, జనం బయటకు రావడం పెరిగింది. అన్ని పండుగుల కన్నా ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతలు వేరు. దీంతో అందరి దృష్టి దీపావళి పండుగపై పడింది. ప్రతి ఇంటిలోను పిల్లలు ఉండడంతో ఈ పండుగను కోలాహలంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అన్ని మతాల వారు ముందు గుండు సామగ్రిని కాల్చడానికి ఉత్సాహపడతారు. అయితే, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది దీపావళికి ప్రజలు వీలైనంత దూరంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
హుద్ హుద్ కారణంగా…
దీపావళి అంటేనే ఉవ్వెత్తున ఎగిసే తారాజువ్వలు.. చెవులు హోరెత్తే టపాసులు.. కళ్ళు మిరుమిట్లు గొలిపే మతాబులు… ఒక్కటేంటి కొన్ని గంటల పాటు అంతా వెలుగుల మయమే. కాని, అటువంటి దీపావళిని దేశమంతా జరుపుకుంటుండగా, ఒక్క విశాఖ వాసులు మాత్రమే దూరంగా ఉన్న సందర్భం జిల్లా చరిత్రలో నమోదయింది. అది కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి దివ్వెల దీపావళి మాత్రమే చేసుకున్నారు. విశాఖలో ఒక్క బాంబు కూడా పేలని ఆ ఏడాదే 2014. విశాఖను కకావికలం చేసిన హుద్ హుద్ తుఫాను కారణంగా విశాఖ వల్లకాడుగా మారింది. ఎక్కడ చూసినా లక్షలాది వృక్షాలు నేలకూలి… కారు చిచ్చు రేగిన అడవిలా మారింది. అప్పటి పరిస్థితుల్లో టపాసులు కాలిస్తే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండడంతో. ప్రజలను అప్రమత్తం చేస్తూ చంద్రబాబు వాటిని నిషేధించాలని పిలుపునిచ్చారు. తుఫాను తరువాత పునరుద్ధరణ చర్యల్లో భాగంగా సుమారు రెండు వారాల పాటు ఆయన నగరంలోనే ఉండి ఆయన స్వయంగా పర్యవేక్షించడంతో… ప్రజలంతా దీపావళికి దూరంగా గడిపారు. ఇంటి ముందు దీపాలు వెలిగించి పండుగను సరి పుచ్చుకున్నారు.
అయితే, ఈ ఏడాది ఇప్పటికే చాలా చోట్ల అన్ని రకాల టపాసుల అమ్మకాలు జరిగాయి. ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి గాని నిషేదాజ్ఞల అమలును పర్యవేక్షించడం కూడ ఫ్రభుత్వాలకు సాధ్యమయ్యే విషయం కాదు. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలన్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి.