(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
’స్థానిక’ ఎన్నికలు త్వరలో జరగొచ్చనే ఊహాగానాల మధ్య ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ముందస్తు సమాయత్తం అవుతున్నాయి. అందులో భాగంగా అధికార, విపక్షాలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నాయి. వీటికి పెద్దయెత్తున ప్రజలను సమీకరిస్తూ రాజకీయ యాత్రలను తలపిస్తున్నాయి. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రాజకీయ వేడిని రగిలిస్తున్నారు.
భారీ బహిరంగ సభలను నిర్వహించిన వైసీపీ
‘ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు’ పేరిట అధికార పక్షమైన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోను సంబంధిత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు నిర్వహించింది. అందులో భాగంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి, పక్క నియోజకవర్గం నెల్లిమర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ గతంలో అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున టీడీపీ అవినీతికి పాల్పడిందన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.1500 ఖర్చును.. రూ.2 వేలు చొప్పున వెచ్చించి టీడీపీ నేతలు దండుకున్నారని విమర్శించారు. ఆ పార్టీ నేతలు టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో కమీషన్ల పేరుతో రూ.వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బ్యాంకుల నుంచి సుమారు రూ.3,600 కోట్ల మేర అప్పులు తెచ్చి కమీషన్లు దండుకున్నారన్నారు. వారి హయాంలో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇప్పుడు ఆందోళనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 చదరపు అడుగుల ఇళ్లను పేద ప్రజలకు ఉచితంగా ఇస్తామని నాడు జగన్ ప్రకటించారని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి చెప్పారు.
Must Read: https://www.theleonews.com/why-do-ysrcp-fear-for-local-bodies-elections/
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతున్న టీడీపీ
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎండగడుతోంది. అందులో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ సర్కారు ఏడాదిన్నర కాలంలో సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని, అభివృద్ధి అడుగంటిందని విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు ధరల పెరుగుదలను ఎత్తిచూపుతూ జిల్లా తెలుగు మహిళలు ఆధ్వర్యంలో విజయనగరంలో నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా విజయనగరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల రైతు బజార్‌కు వచ్చిన వినియోగదారులకు అవగాహన కల్పించింది. ప్రభుత్వ వైఫల్యం వలన కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, ధరల పెరుగుదలను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ మహిళ కమిటీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్సులు సువ్వాడ వనజాక్షి, అనురాధ బేగం, విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు నేతృత్వం వహించారు. వీరు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్దయెత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
వీటన్నింటినీ పరిశీలిస్తున్న ప్రజలు ‘స్థానిక’ సన్నాహాలుగా భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎనిమిది నెలలు స్తబ్దతగా ఉన్న రాజకీయాలు మరోమారు వేడెక్కాయి.
Also Read: ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసన.. అట్టుడికిన విజయనగరం