కోట శ్రీనివాసరావు .. తెలుగు తెరకి సరికొత్త విలనిజాన్ని రుచి చూపించిన విలక్షణ నటుడు. తనదైన డైలాగ్ డెలివరీతో .. మేనరిజంతో ఆయన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కామెడీ టచ్ తోను విలనిజాన్ని పండిస్తూ శభాష్ అనిపించుకున్నారు. ఇక బాబూ మోహన్ కూడా విభిన్నమైన తన డైలాగ్ డెలివరీతోనే హాస్యంపై తనదైన ముద్రవేశారు. ఈ ఇద్దరూ కలిసి తెలుగు తెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. ‘మామగారు’ సినిమా నుంచి ఈ ఇద్దరూ కామెడీని కలిసి నడిపించారు. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో కోట .. బాబూ మోహన్ ఉన్నారా? అని పోస్టర్లో వెతికి చూసుకుని మరీ ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లేవారనడంలో అతిశయోక్తి లేదు. అంతగా తమ పాత్రలను పండించిన ఈ ఇద్దరూ .. ఈ వారం ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో తమ అనుభవాలను .. జ్ఞాపకాలను పంచుకున్నారు.
*”నేను .. బాబూ మోహన్ తెరపై కలిసి కనిపించిన సినిమా ‘బొబ్బిలిరాజా’. అప్పటికే నేను ‘ప్రతిఘటన’ వంటి కొన్ని మంచి సినిమాలు చేసి ఉన్నాను. జంధ్యాలగారి సినిమాలు కొన్ని బాబూ మోహన్ చేసి ఉన్నాడు. ‘మామగారు’ సినిమా నుంచి మాది బెస్ట్ కాంబినేషన్ గా మారిపోయింది. ఆ తరువాత మా కాంబినేషన్లో 60 .. 70 సినిమాలు వచ్చాయి. బాబూ మోహన్ గురించి చెప్పాలంటే మంచి టైమింగ్ ఉన్న నటుడు. సినిమాల్లో నేను తన్నిన తన్నులను బాబూ మోహన్ ఎలా భరించాడా అనిపిస్తుంది. నా కాలు ‘టచ్’ అయితే చాలు .. వెళ్లి కిందపడిపోయేవాడు .. అదే ఆయన గొప్పతనంగా అనిపిస్తుంది. బాబూ మోహన్ అంత టైమింగ్ చూపించకపోతే, ఆ సీన్లు అంతగా ఆకట్టుకునేవి కావేమో”.
*”ఆర్టిస్ట్ కి టైమ్ వస్తే ఇక దేనికీ టైమ్ ఉండదు .. మా ఇద్దరి విషయంలోను అది జరిగింది. బాబూ మోహన్ కారణంగా నా జీవితంలో మరిచిపోలేని సంఘటనలు కొన్ని జరిగాయి. అందులో నేను బాగా ఇబ్బందిపడిన సంఘటన ఒకటి చెబుతాను. ఒకసారి నేను .. బాబూ మెహన్ కలిసి ట్రైన్లో బయల్దేరాము .. ఇద్దరం ‘రాజమండ్రి’లో దిగాలి. తెల్లవారు జామున ‘అన్నా రాజమండ్రి వచ్చేశాం .. లే లే ” అంటూ హడావిడిగా నన్ను నిద్రలేపాడు. దాంతో నా పెట్టె పట్టుకుని బాబూ మోహన్ తో పాటు కంగారుగా దిగేశాను. ఎదురుగా వరుసగా చాలా ఫ్లాట్ ఫామ్స్ కనిపిస్తున్నాయి. ‘రాజమండ్రి’లో ఇన్ని ఫ్లాట్ ఫామ్స్ లేవే అనే డౌట్ వచ్చింది .. కొత్తగా డెవలప్ చేశారేమో అనుకుని అక్కడున్న కూలీని అడిగాను. ఇది రాజమండ్రి కాదండీ .. ‘బెజవాడ’ అన్నాడతను.
*అంతే అప్పటికే మేము దిగిన రైలు కదిలిపోతోంది .. ముందుగా లగేజ్ లోపలికి తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్లీ ఆ ట్రైన్ ఎక్కేశాము. ట్రైన్ ఎక్కిన తరువాత బాబూ మోహన్ పై నాకు కోపం వచ్చింది. “ఎందుకురా రాజమండ్రి రాకుండానే నన్ను లేపావు” అని అడిగితే, “ఏం లేదన్నా బ్రిడ్జ్ సౌండ్ విని రాజమండ్రి వచ్చిందనుకుని లేపాను” అన్నాడు. ఇంకోసారి నేను.. బ్రహ్మానందం .. బాబూ మోహన్ కలిసి ట్రైన్లో వెళుతున్నాము .. రాజమండ్రిలో ట్రైన్ ఓ ఇరవై నిమిషాల సేపు ఆగింది. ఆ సమయంలో ‘మామిడి తాండ్ర’ అమ్మే వ్యక్తి మమ్మల్ని చూసి గుర్తుపట్టాడు. అంతే జనమంతా బిలబిలమంటూ మూగారు. బ్రహ్మానందం దాక్కున్నాడు .. బాబూ మోహన్ నిద్రపోతున్నట్టుగా కళ్లు మూసుకుని తల వాల్చేశాడు. అది చూసి ఒకడు ‘ఆయనకి మందు ఎక్కువైందా?’ అని అడిగాడు. దాంతో బాబూ మోహన్ కి కోపం వచ్చేసి వాడిని కొట్టడానికి పరిగెత్తాడు .. ట్రైన్ కదిలిపోతోంది .. బాబూ మోహన్ ఎంతకీ తిరిగిరాడు” ఇట్లా టెన్షన్ పెట్టే పనులు చాలానే చేసేవాడు” అని చెప్పుకొచ్చారు.











