బాలీవుడ్ భామ అనుష్కశర్మ చక్కటి నటి మాత్రమే కాదు అభిరుచి కలిగిన నిర్మాత కూడా. క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత నటిగా చాలామటుకు సినిమాలను తగ్గించేసుకున్నారు. ఆడపడదపా ఆఫర్లనే అంగీకరిస్తున్నారు. అయితే నిర్మాతగా మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. మంచి కథలను ప్రేక్షకులకు అందించాలన్న తపన ఆమెలో మెండుగా ఉండటమే అందుకు కారణమని సన్నిహితులు అంటున్నారు. తాజాగా ఆమె `పాతాళలోక్’ అనే వెబ్ సిరీస్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, `బుల్బుల్’ పేరుతో రూపొందుతున్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అనునిత్యం తనకు ఎన్ని పనులున్నా, లేకున్నా యోగాసనాలు వేయడం మాత్రం అనుష్కశర్మ మానదట. ప్రస్తుతం గర్భం ధరించినప్పటికీ యోగాసనాలు వేయడం ఆమె ఆపలేదు. వాటిని కొనసాగిస్తూనే భర్త విరాట్ కోహ్లీ సహాయంతో అనుష్క శీర్షాసనం వేశారు. ఈ ఆసనంలో చేతులు కిందకు దించి, కాళ్లు పైకి ఎత్తాల్సి ఉంటుంది. వాస్తవానికి యోగాసనాలు వేయడం అంటే చాలా మంచి అలవాటు. దీనివల్ల ఎన్నో రుగ్మతలు పోతాయని అంటారు. కానీ గర్భధారణ సమయంలో యోగాసనాలు వేసేందుకు చాలామంది భయపడతారు.
అనుష్కశర్మ మాత్రం ఎంచక్కా డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకుని యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఎందరికో స్ఫూర్తినిచ్చే అంశమే అయినప్పటికీ, డాక్టర్ల సలహా లేకుండా ఇతర గర్భవతులు ఎవరూ తొందరపడి వేయవద్దని ఆమె అంటున్నారు. యోగా తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమై పోయిందని వెల్లడిస్తూ, గర్భవతిగా ఉండటానికి ముందు నేను చేస్తున్న అన్ని ఆసనాలను వేయవచ్చని నా వైద్యుడు సిఫారసు చేశాడు .నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్న శీర్షాసనం కోసం గోడను సపోర్ట్ గా తీసుకోవడంతో పాటు అదనపు సురక్షితంగా ఉండటానికి నా భర్త విరాట్ సహకారం సైతం తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నా యోగా టీచర్ ఈఫా ష్రాఫ్ పర్యవేక్షణలో కూడా ఇది జరిగింది అని ఆమె వెల్లడించారు.










