(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తక్షణమే ఢిల్లీకి వెళ్లి అందరిని కలిసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్నామని నిన్న పార్లమెంట్‍లో కేంద్రం ప్రకటించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో వైసీపీ నేతలే చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్‍ను ప్రైవేటీకరించి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని నేతలను కోరారు. అందరూ ఒక మాటమీదకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రధానితో మాట్లాడే అవకాశం అనేక సార్లు వచ్చినా స్టీల్ ప్లాంట్‍పై జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
జగన్ నాయకత్వంలో నడిచేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పినా..
జగన్ చొరవ తీసుకుంటే టీడీపీ కూడా వెనుక ఉంటుందని చంద్రబాబు కూడా ఇప్పటికే చెప్పారన్నారు. సీనియర్ నాయకుడైనా ఎటువంటి భేషజాలకు పోకుండా జగన్ నాయకత్వంలో వెనుక నడిచేందుకు సిద్ధమని చెప్పినప్పటికీ ఎందుకు కార్యాచరణ రూపొందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ జోక్యం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడినంత మాత్రాన పవన్ బాధ్యత తీరి పోలేదని, నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఒత్తిడి కొనసాగించాలని కోరారు.
బడ్జెట్ సమావేశాల్లో రాజీనామాను ఆమోదింపజేసుకుంటా..
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరతానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని, అప్పుడే జాతీయ స్థాయిలో దృష్టి ఇటు వైపు మళ్ళుతుందని తెలిపారు.అంతా రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగి వస్తుందని గంటా అభిప్రాయపడ్డారు.
Must Read ;- విశాఖ స్టీల్‌లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా











