(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఎన్నో విధాలుగా ఆందోళనలు చేస్తున్నా విశాఖ ఉక్కు ప్రవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గటం లేదు. పార్టీలకతీతంగా 20 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఒక్కటై ఉద్యమిస్తున్నారు. ఒకవైపు కార్మిక సంఘాలు నిరసన దీక్షలు చేస్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. అటు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయినా కేంద్రం వెనక్కు తగ్గ లేదు. విశాఖ ఉక్కు అమ్మకం దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
అనుకూలమైన ప్రకటన వస్తుందని సీఎం హామీ
మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అర్థం ఏమిటి? ప్రధాని మోదీకి అందరి కంటే ముందు తామే లేఖ రాశామని, ఖచ్చితంగా అనుకూలమైన ప్రకటన వస్తుందని కార్మిక సంఘాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైనట్టు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం.. అంటూ ఇంతకాలం ప్రకటనలు చేసిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యల పరమార్ధం ఏమిటి? ఎవరు ఎన్ని చేసినా… విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ఆపలేమా? ఇది అందరి ముందున్న అతి పెద్ద ప్రశ్న.
ధర ఖరారు చేసి విక్రయించడమే మిగిలింది..
కేంద్రం పోస్కో ప్రతినిధులతో సంప్రదింపులు జరపడం, ఆపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం.. ఈ మేరకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఎంఓయూ కుదుర్చుకోవడం అన్ని చకచకా రెండేళ్ళ క్రితమే జరిగిపోయాయి. ఏం కాదు స్టీల్ ప్లాంట్ … జోలికి వస్తే సహించం… మీ వెంట మేముంటాం.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం… అంటూ ఎన్నో ప్రగల్బాలు పలికిన నాయకుల హెచ్చరికల కేంద్రం పెద్దలు ఆ చెవితో విని మరో చెవితో వదిలేసినట్టు స్పష్టమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆక్షన్ స్థాయికి చేరిందని, ఇక ఉక్కు పరిశ్రమకు అధిక ధర లభించగానే, అమ్మకానికి పెట్టడమే మిగిలిందంటున్నారు కేంద్రం కదలికలను దగ్గరగా గమనిస్తున్న నిపుణులు.
దూకుడుగా కేంద్రం..
ప్రైవేటీకరణలో భాగంగా తాజాగా మరో అడుగు ముందుకేసింది కేంద్రం. కేబినెట్ కమిటీ నుంచి అనుమతి రావడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ తాజాగా ఇంటర్ మినిస్టీరియల్ గ్రూపు కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇండస్ట్రీని హైలెవల్ కమిటీకి అప్పగించి.. ధర నిర్ణయించి అమ్మడమే మిగిలింది. కేంద్రం మొండిగా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు.
ప్రభావం చూపని ఆందోళనలు?
విశాఖ వేదికగా పార్టీలన్నీ ఏకమయ్యాయి. ‘ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు‘ అని నినదిస్తున్నారు. అయినా దీనిపై అడుగు కూడా వెనక్కు తగ్గడం లేదు హస్తిన పెద్దలు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి సిద్దమైంది. ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తామని రాష్ట్ర సర్కార్ చెబుతున్నా వీటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఉద్యమ సంఘాలు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన భూముల విక్రయ ప్రతిపాదనను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. భూములు అమ్మడం.. లేదా ఐపీవోకు వెళ్లడం అంటే దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టడమేనంటున్నారు కమ్యూనిస్టు నేతలు. ఎలాంటి హిడెన్ ఎజెండా లేదంటున్న ఏపీ ప్రభుత్వం.. వందశాతం విశాఖ స్టీల్ యధాతథంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామంటోంది. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తమను కాదని కేంద్రమే నిర్ణయం తీసుకోదన్న ధీమా వ్యక్తం చేశారు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.
Must Read ;- విశాఖ ఉక్కు.. ఇక అమ్మకమే తరువాయి!
ఆది నుంచి దోబూచులాట..
కార్మిక సంఘాల నేతలతో కేంద్రం ఆది నుంచి దోబూచులాట ఆడుతోంది. 2019 పోస్కో ప్రతినిధులతో చర్చల అనంతరం, ఆ సంస్థ ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ భూములను పరిశీలించడం, ఒక అంగీకారానికి రావడం యం వో యు రాసుకోవడం పూర్తి చేసిన కేంద్ర మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాత్రం మరో విధంగా మాట్లాడారు. పోస్కో ప్రతిపాదనపై సమాచారం తెలుసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ సభ్యులంతా రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి పర్యటనను విశాఖలో అడ్డుకున్నారు. సుమారు గంట పాటు కేంద్రమంత్రి హెలికాప్టర్‌ను ల్యాండ్ కానివ్వలేదు. చివరకు పరిశ్రమ పెద్దలు ఇతరులు సుమారు 40 మంది ట్రేడ్ యూనియన్ నాయకులతో చర్చలకు ఏర్పాట్లు చేశారు. దీంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వారితో చర్చలు జరిపారు. ట్రేడ్ యూనియన్‌లను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని హామీ ఇచ్చి వెనుదిరిగారు. అదే మంత్రి విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సులో స్టీల్ ప్లాంట్ భూములలో పోస్కో జాయింట్ వెంచర్ చేసేందుకు ఆసక్తి చూపినట్లు ప్రకటించారు. కాగా ఈ రెండు పరిణామాలకు ముందే కేంద్రం పోస్కోతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఎవరి వద్ద వారికి నచ్చినట్లు ప్రకటనలు చేసి, కేంద్రం చేయాలనుకున్న పనిని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసింది. అటువంటి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణి కారణంగా తెలుగు వారి ఆత్మ గౌరవం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని అంతా ఆందోళన చెందుతున్నారు.
శవాల మీద నుంచి వెళ్తారా?
స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రాణత్యాగాలకు సిద్దంగా ఉన్నామని ట్రేడ్ యూనియన్ నేతలు చెబుతున్నారు. కేంద్రం దొడ్డిదారిన, గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో మరో సంస్థకు కట్టబెట్టినా… ఆ సంస్థ ప్రతినిధులు విశాఖలో అడుగు పెట్టగలరా? అని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. సుమారు మూడు వేల ఎకరాల్లో పరిశ్రమ నెలకొల్పాలంటే, కొన్ని లక్షల టన్నుల నిర్మాణ సామగ్రిని తరలించాల్సి ఉంటుందని ఆ వాహనాలను.. తమ శవాల మీద నుంచి తీసుకు వెళతారా అని ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమను కేంద్రం సహకారంతో కొనుగోలు చేసినా, విశాఖ పరిశ్రమలో అడుగు పెట్టగలరా? నిర్మాణ పనులు సాగించగలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.
పరిశీలించేందుకే కోరిందా?
స్టీల్ ప్లాంట్ ఆస్తులు, అప్పులు, నష్టాలకు గల కారణాలతో పాటు సాంకేతిక పరమైన వివరాలు కేంద్రం కోరినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై సాధ్యాసాధ్యాలు తెలుసుకునేందుకు నివేదిక కోరే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- ఆదరించిన వారిని వంచిస్తారా.. బీజేపీ నేతల తీరుపై విశాఖవాసులు గరం