(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఉంది ఏపీలో బీజేపీ పరిస్థితి. జనసేన- బీజేపీ పొత్తు పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలను రాబట్టగలిగింది. అదే ఊపు మీద గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ( జీవీఎంసీ) ఎన్నికల్లోనూ సత్తా చాటాలి అనుకున్నా ఆ పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదేమో అనిపిస్తోంది. గత మూడు రోజులుగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో చాలా హడావిడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల పైన, మీడియాపైన తన అక్కసును వెళ్లగక్కారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో చేస్తున్నా, ఆ ఫలితం ప్రజల నుంచి రావడంలేదని, తగిన ప్రచారం కల్పించడంలో మీడియా ఏకపక్ష ధోరణి అవలంబిస్తోందని తన ఆవేదనంతా వెళ్లగక్కారు. అక్కడి వరకు బాగానే ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఫలితాలు వెలువడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే విశాఖలో బీజేపీకి పడుతుందని అంచనా వేస్తున్నారు.
బీజేపీ రెండు నాల్కల ధోరణి..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది. కేంద్ర బీజేపీ నాయకులు ఒక రకమైన ప్రకటనలు చేస్తుంటే, రాష్ట్ర నాయకులు మరో విధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టేశారు . జాతీయ నాయకురాలు పురందేశ్వరి, ఎమ్మెల్సీ pvn మాధవ్, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కేంద్రం ప్రకటనపై విశాఖ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత రాకుండా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా, అధిష్ఠానం ఆగ్రహానికి గురికాకుండా సమతూకం పాటిస్తూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. కేంద్రం నిర్ణయం ఏదైనప్పటికీ… ‘ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ సెంటిమెంట్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా, ఇక్కడి ప్రజల మనోభావాలు వారికి అర్థమయ్యేలా వివరిస్తామని ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చారు. గత నెల ఉద్యమం ప్రారంభమైన తొలి నాళ్లలో ఈ బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఇవి. ఉద్యమం తీవ్రతరం అవుతున్న కొద్దీ… బీజేపీ నేతలు ఈ అంశంపై ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. మీడియా సమావేశాలు తగ్గించేశారు. విశాఖ ఉక్కు అంశంపై మాట్లాడటం మానేశారు. దీంతో ప్రజల్లో ఒకింత అసహనం వ్యక్తమవుతున్నా అది బహిర్గతం కాలేదు.
ఊపందుకున్న ఎన్నికల వేడి..
ఒకవైపు ఉక్కు ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుండగా, మరోవైపు జివిఎంసి ఎన్నికలకు కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యమం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఈ క్రమంలో జనసేనకు మంచి అభిమానులున్న విశాఖలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ, జీవీఎల్ వ్యాఖ్యల కారణంగా… ఆ అవకాశాలు మృగ్యం అయినట్టు భావించాల్సి వస్తోంది.
Must Read ;- నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు
ప్లాంట్ ప్రైవేటీకరణతోనే అభివృద్ధి..
తాజాగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మూడు రోజులుగా విశాఖలో పర్యటిస్తున్నారు. జనసేన– బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో చేసిందని, లెక్కలతో సహా వివరించడం ప్రారంభించారు. ఇక విశాఖ విషయానికి వస్తే, తొలి స్మార్ట్ సిటీగా ప్రకటించిన నాటి విషయాలు మొదలుకొని.. విశాఖ – చెన్నై కారిడార్ వల్ల కలిగే లాభాల వరకు ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాజెక్టులను పనిలోపనిగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఎన్ఏడి కొత్త రోడ్‌లోని ఫ్లైఓవర్ సందర్శించి, డిజైన్‌లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందో లేదో కనుక్కొని తీరుతానన్నారు. ప్రతిష్టాత్మక నగరంలో ఇటువంటి వంతెన ఎలా నిర్మిస్తారని, ఈ విషయంలో గత టీడీపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపి ప్రభుత్వాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ వంతెన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకుంటూ వచ్చారు.
సార్ అంతటితో ఆగి ఉంటే బాగుండేది.. స్టీల్ ప్లాంట్ అంశంపై విలేకరులు ప్రశ్నించగానే, ఏదో గోడ మీద పిల్లి వాటంలా సమాధానం చెప్పకుండా, తాను నిజాలే మాట్లాడతానని పదేపదే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ వారి గొయ్యి వారే తవ్వుకున్నట్టు పలు స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? ప్రైవేటు యజమాన్యం చేతుల్లోకి వెళితే ఇంకా సమర్థంగా పనిచేయగలదని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రైవేటీకరణ ఇంత త్వరగా జరగబోదని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే మరో 42 పరిశ్రమలు ఈ జాబితాలో ఉన్నాయని, వాటి తర్వాత స్టీల్ ప్లాంట్ వంతు వస్తుందని సెలవిచ్చారు ఎంపీ జీవీఎల్. పోనీ అంతటితో ఆగారా అంటే… మరో అడుగు ముందుకేసి, స్టీల్ ప్లాంట్ పిఎస్‌యూగా కొనసాగితే, అది రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, అవినీతి అధికారులకు లాభిస్తుంది తప్ప మరే ఉపయోగం లేదన్నారు. ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన పరిశ్రమ ఇక్కడి నుంచి ఎక్కడకు వెళ్లదని, పైగా మరింత అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు. గత ప్రభుత్వాలు అవే కొరియాకు చెందిన సంస్థలను తీసుకువస్తే స్వాగతిస్తారు గాని, తాము తీసుకొస్తే వ్యతిరేకిస్తారా అంటూ ఎదురుప్రశ్న వేస్తున్నారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని నేరుగానే చెప్పేశారు.
మండిపడుతున్న ఓటర్లు..
ప్రాణ త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో పెట్టేందుకు కంకణం కట్టుకున్న బీజేపి పేరు చెబితే నేడు విశాఖ ఓటర్లు మండిపడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జివిఎంసి ఎన్నికల్లో బీజేపీపై ఈ ప్రభావం ఏ మేరకు చూపుతుందో వేచి చూడాలి మరి!
Must Read ;- ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం