ఓవైపు తమ ఎంపీలమంతా కలసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామని, ఇప్పటికే మాటతప్పని, మడమ తిప్పని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని అధికార వైసీపీ చెబుతోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే.. మొన్న పాదయాత్ర, బంద్‌కి సారథ్యం వహించారు. గ్రూప్ ఫర్‌పార్మెన్స్ కూడా బాగా రక్తికట్టించారన్న ట్రోల్ జరిగే స్థాయిలో మైక్ పట్టుకుని మాట్లాడారు. చంద్రబాబు సర్కారుదే తప్పంతా అని పాపాలభైరవుడిగా చంద్రబాబుపై నింద నెట్టేశారు. అయితే తాజాగా కేంద్రం అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. అధికార వైసీపీ పార్టీకే కాదు.. ఏపీకి ఇది షాక్ అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఆ పార్టీ ఉంది కాబట్టి…ఆ పార్టీ బాధ్యత ఎక్కువగానే ఉంటుంది. అయితే విశాఖ ప్రైవేటీకరణ ఇష్యూలో వైసీపీ చెప్పింది, చేస్తున్నది ఒకటేనా.. లేక కేవలం రాష్ట్రంలో ఒకరకంగా, కేంద్రంతో ఒకరకంగా వ్యవహరిస్తోందా అనే సందేహాలు వస్తున్నాయి.
విశాఖ ఉక్కు కర్మాగారంలో రాష్ట్రానికి వాటా లేదని..
వైసీపీ ఎంపీలు గీత, సత్యనారాయణలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. అసలు విశాఖ ఉక్కు కర్మాగారంలో రాష్ట్రానికి వాటా లేదని, విశాఖ స్టీల్‌లో నూరుశాతం పెట్టుబడుల ఉప సంహరణ జరుగుతుందని, రాష్ట్రానికి ఈక్విటీ లేదని తేల్చి చెప్పారు. దీంతో విశాఖ ఉక్కుపై ఆంధ్రుల హక్కు లేదా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇదే ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆగేదిలేదని వ్యాఖ్యానించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నానమన్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో రాష్ట్రానికి సంబంధం లేదనే రీతిలో సమాధానం చెప్పారు.
Must Read ;- జీవీఎల్ వ్యాఖ్యలతో రగిలిపోతున్న ఓటర్లు.. విశాఖలో బీజేపీ అడ్రస్ గల్లంతేనా?
ఆశలపై నీళ్లు.. తొలుగుతున్న ముసుగు
విశాఖ స్టీల్స్‌ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం సిద్ధపడుతుండడంతో అన్ని పార్టీలూ ఆందోళనకు సిద్ధమయ్యాయి. బీజేపీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నా.. టీడీపీ తొలినాటి నుంచి ఉద్యమంలో పాలుపంచుకుంది. వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా ఆందోళనలో పాలు పంచుకున్నాయి. ఆ మధ్య వైఎస్ జగన్ విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రతిపాదనలు పంపామని, లేఖ రాశామని, కేంద్రం పెద్ద మనస్సు చేసుకుని సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు కొన్నాళ్ల ముందు.. విశాఖ ఉక్కు సంస్థతో పోస్కో ఒప్పందం చేసుకుందన్న విషయం చెప్పిన ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకు.. ఆయనే రాజ్యసభలో ఈ ప్రశ్న లేవనెత్తారు. అందుకు సమాధానంగా 2019 చివరి త్రైమాసికంలోనే ఒప్పందం జరిగిందని సమాధానం రావడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిందని చెప్పవచ్చు. తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనే టెన్షన్ వైసీపీలో మొదలైంది.
ఆందోళనలు..ఒత్తిళ్లు
కాగా కేంద్రం చేసిన ప్రకటనతో బుధవారం కార్మిక సంఘాలు సమావేశం కానున్నాయి. జాతీయ స్థాయి వివిధ దశల్లో ఆందోళనాకార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్ లేఖరాసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం చేసిన తాజా ప్రకటనతో..జగన్ రాసిన లేఖను కేంద్రం పట్టించుకోలేదని భావించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. కాగా ఇప్పటికే ఏపీ సీఎం జగన్ అటు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగిన విషయం తెలిసిందే. మరోసారి భేటీ అయినా.. విశాఖ స్టీల్ పై కేంద్ర నిర్ణయాన్ని జగన్ మార్చగలుగుతారా అనేది చూడాలి.
Also Read ;- విశాఖ ఉక్కు.. ఇక అమ్మకమే తరువాయి!