(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే కుక్కలు, గాడిదలు పైన కూడా పన్ను విధిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించకపోవడం ట్రేడ్ యూనియన్లను అవమానించడమేనని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. విశాఖలో రెండో రోజు ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ప్రధాని వాజపేయి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని చూస్తే, ఆంధ్రుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయనకి వివరించినట్టు చంద్రబాబు తెలిపారు. దీంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవడమే కాకుండా, నష్టాలను కూడా భర్తీ చేశారన్నారు. ముఖ్యమంత్రికి దొంగ స్వాములను కలిసే తీరిక ఉంది, ఆయనతో ముద్దులు పెట్టించుకునే ఖాళీ ఉంది కానీ, ప్లాంట్ ఉద్యమాన్ని పట్టించుకునే తీరిక లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే పీల్చే గాలి పైన కూడా పన్ను వేస్తారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.5 వేల పన్ను భారాన్ని వైఎస్ఆర్సీపి సర్కారు లక్షా 50 వేలకు పెంచుతుందని, ఖాళీ స్థలాలకు, కుక్కలకు, గాడిదలకు కూడా పన్ను వేస్తారని, అటువంటి పాలన, ఇలాంటి చెత్త ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు.
ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని, 50 వేల మందికి పట్టాలు పంపిణీ చేశామని చెప్పి, కాగితాలను చేతిలో పెట్టి ఓట్లు అడుగుతున్నాడని ఆరోపించారు. హుదూద్ తుఫాను విలయం తర్వాత విశాఖలో హరిత విప్లవం తీసుకువస్తే, ఆ చెట్లకు నీరు పోసే నాధుడు కూడా లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
Must Read ;- గెలిపిస్తే ఆస్తి పన్ను తగ్గిస్తాం.. పట్టణవాసులకు చంద్రబాబు హామీ