మినీ పురపాలక ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఖమ్మం, వరంగల్ నగర పాలక సంస్థలతో పాటు ఎన్నికల జరిగిన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, అచ్చంపేట, సిద్ధిపేటలను కైవసం చేసుకుంది. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.ఈ గెలుపుతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలం 3కి పెరిగింది.
పూర్తి ఆధిక్యం..
ఓట్ల లెక్కింపులో మొదటి నుంచే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటూ వస్తోంది. సిద్ధిపేటలో 43స్థానాలకు గాను 36 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఒకచోట బీజేపీ, మరో6 చోట్ల ఇతరులు గెలిచారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలో ఫలితాలపై జిల్లాలో ఆసక్తి నెలకొంది. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులుండగా 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 27 వార్డుల ఫలితాల్లో టీఆర్‌ఎస్ 23 వార్డుల్లో విజయం సాధించి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ మున్సిపాల్టీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ రెండు, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఇటీవలే మున్సిపాల్టీగా మారిన కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులను కైవసం చేసుకోగా ఐదు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నకిరేకల్ లోనూ గులాబీ జెండా ఎగిరింది. 20 వార్డులకు గాను 11 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
బీజేపీకి షాక్..
కాగా జీహెచ్ఎంసీ పరిధిలో లింగోజిగూడ డివిజన్ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన రమేష్‌గౌడ్ ప్రమాణ స్వీకరానికి ముందే చనిపోయారు. దీంతో ఆయన కుమారుడైన పవన్‌కి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. బీజేపీ కోరిక మేరకు టీఆర్ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి నిల్చున్నారు.ఈరోజు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి గెలుపొందారు.
వరంగల్, ఖమ్మం టీఆర్ఎస్ సొంతం..
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. వరంగల్ లోని 66స్థానాల్లో 41స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇతరులు రెండుచోట్ల గెలుపొందారు. ఇంకా తుది సమాచారం రావాల్సి ఉంది. ఇక ఖమ్మం నగర పాలక సంస్థ విషయానికి వస్తే.. ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. రెండు డివిజన్‌లు టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం కాగా 58 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 38స్థానాలు రాగా బీజేపీకి 1, కాంగ్రెస్ పార్టీకి 6, ఇతరులకు 2 స్థానాలు వచ్చాయి. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం మీద మినీ పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం సాధించగా కాంగ్రెస్‌కు రెండోస్థానం దక్కింది. బీజేపీ మూడో స్థానానికి పడిపోయిందన చెప్పవచ్చు.










