అమెజాన్ ప్రైమ్ లో సినిమాలు తరచుగా వీక్షించే ప్రేక్షకులకు కాలక్షేపాన్నిచ్చే ఓ వైవిధ్యమైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘వారికుళియిలే కొలబాదకం’ ( ఏనుగుల్ని పట్టే గోతిలో హత్య). నేరము చేసిన వాడికి .. చూసినవాడు లోకువా అనిపించే కథాంశం ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో మంచి అనుభూతినిచ్చే సినిమా.
కథేంటి?: విన్సెంట్ కొంబన్ అనే యువకుడు .. పోలీసు అవ్వాలనుకొని తండ్రి కోరిక మేరకు ఒక గ్రామంలోని చర్చ్ కి ఫాదర్ అవుతాడు. తన బుద్ధిబలంతో , కండబలంతో గ్రామంలోని ప్రతీ ఒక్కరిని క్రమశిక్షణలో పెడతాడు. తప్పుచేసిన వాడికి ముందుగా మందు పార్టీకి రమ్మని చెప్పి.. తనింట్లో రేవు పార్టీ పెడుతుంటాడు. కొంబన్ రాత్రి వేళల్లో దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామం అంతటా గస్తీ తిరుగుతుంటాడు.
ఆ క్రమంలో ఒకరోజు అర్ధరాత్రివేళలో ఒక హత్య ను కళ్ళారా చూస్తాడు. ఒక వ్యక్తిని చంపేసి గోతిలో పూడ్చిపెట్టేస్తాడు హంతకుడు. ఆ హంతకుడు కొంబన్ కు బాగా పరిచయం ఉన్నవాడే. అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి.. అతడ్ని చట్టానికి పట్టించాలి అనుకున్నంతలోనే ఆ హంతకుడు కొంబన్ కు ఓ షాకిస్తాడు. అదేంటి? చివరికి ఫాదర్ తన బుద్ధిబలంతో అతడ్ని చట్టానికి ఎలా పట్టించగలిగాడు? అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు?: మలయాళంలో ఎక్కువగా క్రిష్టియన్ బ్యాక్ డ్రాప్ కలిగిన సినిమాలు వస్తుంటాయి. అయితే ఆ సినిమాల్లోని చర్చ్ ఫాదర్స్ శాంత స్వభావం కలిగిన వారుగా కనిపిస్తుంటారు. ఊరి వారి మంచిచెడ్డలు చూస్తూ.. వివాదాలొస్తే పరిష్కరిస్తుంటారు. కానీ ఈ సినిమాలో ఒక చర్చ్ ఫాదర్ నే హీరోగా చూపించడం.. అతడి వీరత్వాన్ని ప్రొజెక్ట్ చేయడం వైవిధ్యంగా అనిపిస్తుంది. అంతేకాదు .. పోలీసు అవ్వాలనుకున్నవాడు ఫాదర్ అయితే అతడి మనస్తత్వం పోలీసు లాగానే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాడు.
అందులో దర్శకుడు చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. కాకపోతే.. చర్చ్ ఫాదర్ గెటప్ లో ఫైట్స్ చేస్తే బాగోదు అనిపించిందేమో.. దర్శకుడు చాలా సీన్స్ ను ఫైట్స్ అవసరం లేకుండానే హీరో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో మేనేజ్ చేశాడు. చర్చ్ ఫాదర్ గా అమిత్ చకలక్కల్ అనే కొత్త కుర్రోడు అదరగొట్టాడు. అలాగే హంతకుడిగా మలయాళ దర్శకుడు , నటుడు దిలీష్ పోత్తన్ (మహేషిండే ప్రతికారం ఫేమ్ ) మెప్పించాడు.
హైలైట్స్ : నేరం చేసిన ప్రతీవాడూ తప్పించుకోవాలనే చూస్తాడు. ఆ ప్రాసెస్ లో లూప్ హోల్స్ ను వెతుకుతాడు. సరిగ్గా ఈ సినిమాలో కూడా నేరస్తుడికి ఓ లూప్ హోల్ దొరుకుతుంది. దాని ఆధారంగానే అతడు.. శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. ఆ సన్నివేశం ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. దర్శకుడు రాజేష్ మిథిల ప్రతీ సన్నివేశాన్ని చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
నటీనటులు : అమిత్ చకలక్కల్ , షమ్మి తిలకన్, లాల్, లీనా , నెడుముడి వేణు, సుధీకొప్ప, మెజో జోసెఫ్, దిలీష్ పోత్తన్ తదితరులు
నిర్మాణం : రాజేష్ మిధిల, షిబుదేవదత్, సుజిష్ కొలొత్తొడి
దర్శకత్వం : రాజేష్ మిథిల
ఎక్కడ చూడాలి? : అమెజాన్ ప్రైమ్
ఒక్క మాటలో : ఇంటెలిజెంట్ క్రైమ్ థ్రిల్లర్
భాష : మలయాళం
రేటింగ్ : 3.5 / 5
-ఆర్కే