ఈ తరం ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో థ్రిల్ చేస్తూనే ఉండాలి దర్శకులు. స్టోరీ లైన్ ఎలా ఉన్నా పట్టింపు లేదు కానీ.. స్ర్కీన్ ప్లే ఇన్నోవేటివ్ గా లేకపోయినా, సన్నివేశాలు బోర్ కొట్టించినా.. రొటీన్ ఫ్లేవర్ తగిలినా.. ఆ సినిమాల్ని నిర్మొహమాటంగా తిప్పికొడతారు. అందుకే పరిస్థితి రాకుండా.. నవతరం దర్శకులు సరికొత్త జోనర్స్ తో ప్రయోగం చేస్తున్నారు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ, కల్కి’లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ.. అవి పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు. అందుకే మనోడు జాంబి థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకున్నాడు. జాంబిరెడ్డితో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వడానికి రెడీ అవుతున్నాడు.
ఇప్పుడు మరో దర్శకుడు కూడా ఓ కొత్త జోనర్ ను టాలీవుడ్ కు పరిచయంచేసే పనిలో ఉన్నాడు. అతడి పేరు స్వరూప్ ఆర్.యస్.జే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో టాలీవుడ్ జనానికి మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు. ఎవరూ టచ్ చేయని ఓ సరికొత్త పాయింట్ తో అందరి హార్ట్స్ టచ్ చేశాడు. ఇప్పుడు అదే దర్శకుడు మరింత కొత్తగా జనాన్ని ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ఈ డైరెక్టర్ టచ్ చేస్తోన్న జోనర్ ఏంటంటే.. బౌంటీ హంటింగ్ థ్రిల్లర్ జోనర్. కొన్ని సందర్భాల్లో పోలీసులు తమను ముప్పు తిప్పలు పెట్టే ఒక క్రిమినల్ పేరు పై అత్యధిక క్యాష్ రివార్డ్స్ ను ప్రకటిస్తారు.
పట్టుకుంటే పదివేలు, పట్టుకుంటే లక్ష లాంటి ఆకర్షించే బహుమతులు ప్రకటించి.. వారిని పట్టిచ్చినవారికి ఆ బహుమతుల్ని అందజేస్తారన్నమాట. ఈ తరహా బౌంటీ హంటర్స్ ను సాధారణంగా మనం కౌబాయ్ మూవీస్ లో చూస్తూ ఉంటాము. కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’, చిరంజీవి ‘కొదమ సింహం’ సినిమాల్లో వారు బౌంటీ హంటర్స్ ను పట్టిచ్చే సీన్స్ ఆ సినిమాల్లో హైలైట్స్ గా నిలిచాయి. ఇక పూరీ జగన్నాథ్ ‘ఏక్ నిరంజన్’ లో ప్రభాస్ బౌంటీ హంటర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు స్వరూప్ తీస్తోన్న సినిమాలో కూడా ఓ నేరస్తుడి కోసం సాగే అన్వేషణ నేపథ్యంలో సాగుతుంది. రీసెంట్ గా ఈ సినిమా అనౌన్స్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ మీద ఒక వ్యక్తి పోస్టర్ పై వాంటెడ్ అని కనిపిస్తుంది. అతడ్ని పట్టిచ్చిన వారికి 50 లక్షల క్యాష్ అవార్డు అని కూడా పోస్టర్ మీద కనిపిస్తుంది. తిరుపతి నేపథ్యంలో తెరకెక్కే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కేస్టింగ్ ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు. ఈ సినిమా కూడా ఏజెంట్ ఆత్రేయ తరహాలోనే ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.
ఇక ఇదే తరహాలో మలయాళంలో కూడా ఓ సినిమా రాబోతోంది. దాని పేరు ‘కురుప్పు’. నలభై ఏళ్ళక్రితం కేరళ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన నొటోరియస్ క్రిమినల్ సుకుమార కురుప్పు అనే వాడి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాలో కూడా.. ‘కురుప్పు’ మీద భారీ ఎత్తున క్యాష్ రివార్డు ప్రకటిస్తారు పోలీసులు. ఒక రకంగా ఈ సినిమా కూడా బౌంటీ హంటింగ్ థ్రిల్లరనే చెప్పాలి. ఆ హంతకుడు ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. సో.. మరి బౌంటీ హంటింగ్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాలి.











