Evaru Meelo Koteeswarulu Latest Promo :
తారక్ అమ్మ సెంటిమెంట్ తో దెబ్బ కొట్టేశారు. జెమినీ టీవీ కోసం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు ఆయన హోస్ట్ అనే సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మరో ప్రోమో రిలీజైంది. ఈ నెల 15 నుంచి ఈ షో ప్రారంభం కాబోతోందనే సమాచారం ఉంది. అందుకే మరో ప్రోమోను జనం మీదికి వదిలారు. ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చంటూ’ సెంటిమెంట్ మంత్రాన్ని తారక్ పఠించారు. ఇక ఈ ప్రోమో లోకి వెళదాం. స్కూల్లో టీచర్ విద్యార్థులను అడుగుతుంది ‘పిల్లలూ.. పెద్దయ్యాక మీరు ఏమవ్వాలనుకుంటున్నారు?’ అని.
అందరూ ఒక్కోటి చెబితే ఓ చిన్నారి మాత్రం ‘అమ్మ కావాలనుకుంటున్నాను టీచర్’ అంటుంది. కాలేజీలోనూ ఓ యువతి నుంచి ఇదే సమాధానం.. కట్ చేస్తే ఎవరు మీలో కోటీశ్వరులు.. హోస్ట్ గా ఎన్టీఆర్.. ఎదురుగా ఓ యువతి. ‘గెలిచిన డబ్బుతో ఏంచేయాబోతున్నారో చెప్పేశారు.. అసలు మీరు జీవితంలో ఏమవుదామనుకుంటున్నారు?’ అంటూ ఎన్టీఆర్ సూటి ప్రశ్న. ‘అమ్మనవ్వాలనుకుంటున్నాను సార్’ ఆమె సమాధానం. విస్తుపోయారు
ఎన్టీఆర్..‘అమ్మా’ అని ఎన్టీఆర్ అంటే ‘ఔను సార్.. మేం ముగ్గురం ఆడపిల్లలం. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఇళ్లల్లో పనిచేసి మమ్మల్ని పెంచింది సార్. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ మున్సిపల్ వర్కర్ గా రోడ్లు శుభ్రం చేసేది. ఆమె కష్టమంతా మేం బాగుండాలనే సార్. పైలట్ అయితే విమానాన్ని నడపొచ్చు, కలెక్టరైతే జిల్లాని నడపొచ్చు, సీఎం రాష్ట్రాన్ని నడపొచ్చు. కానీ రేపటి తరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మవల్లే సాధ్యం కదా సార్.’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది ఆ యువతి. మనసులు గెలుచుకునే మంత్రం అంటే ఇదే కదా.
‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది కల మీది. ఆట నాది కోటి మీది.రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులో’ ఎన్టీఆర్ తన తారక మంత్రాన్ని పఠించారు. మొత్తానికి మరోసారి ఈ షోపై హైప్ క్రియేట్ అయ్యింది. గతంలో బిగ్ బాస్ సీజన్-1తో బుల్లితెరపై సంచలనానికి తెరతీసిన తారక్.. మరోసారి ఇలా బుల్లితెర ఆడియన్స్ ముందుకు రానుండటం అందరిలోనూ ఆతృతను పెంచేసింది. ఈ నెల లోనే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రారంభం కానుంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా విడుదలైన ప్రోమో కూడా తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ తాజా ప్రోమో.











