నవరసాలు లేకుండా మనిషి జీవితమే లేదు. మనిషి జీవితంలో లేనిది కళారూపాల్లో ఎలా ఉంటుంది. అందుకే కళకు ఆయువు పట్టు నవరసాలే. మరి ఈ నవరసాలను వెబె సిరీస్ రూపంలో పలికిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు పునాదే ‘నవరస’ వెబ్ సిరీస్. దర్శకుడు మణిరత్నం మదిలో మెదిలిన ఈ ఆలోచనకు ఎందరో నటీనటులు సహకరించారు. సూర్య, అరవింద స్వామి, సిద్ధార్థ్, విజయ్‌సేతుపతి.. ఇలా అగ్ర తారలంతా తమ చేయూతనివ్వడంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఇందులో నవరసాలు ఎలా పలికాయి? అనే విషయాలను తెలుసుకుందాం.
కథల్లోకి వెళదాం..
1. కరుణ: కరుణ రసంతో మొదలైన కథ శృంగార రసంతో ముగుస్తుంది. విజయ్ సేతుపతి, రేవతి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రధారులుగా కరుణ రూపొందింది. భర్త మరణానికి కారణం తానేనని మధనపడే భార్య, ఒక మనిషిని చంపడంకన్నా దాన్ని చూసిన మహిళ తనను ఎందుకు ఆపలేదు అని బాధపడే వ్యక్తి మధ్యసాగే ఎమోషనల్ డ్రామా ఇది. రేవతి ఇంటికి వచ్చిన విజయ్ సేతుపతి ఆమె భర్తను హత్య చేస్తాడు.
చివరికి ప్రకాష్ రాజ్ ఇంట్లో తలదాచుకుంటాడు. ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రకాష్ ఎవరు అన్నది కరుణలో చూడాల్సిందే. బిజోయ్ నంబియార్ దీనికి దర్శకత్వం వహించారు. క్షణకావేశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఇందులో అంతర్లీనంగా కనిపిస్తుంది.
2. హాస్యం: ఓ హాస్యనటుడు తన చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల వార్షికోత్సవానికి వస్తాడు. చిన్నప్పటి సంఘతులను నెమరువేసుకుంటాడు. ఈ పాత్రను యోగిబాబు పోషించారు. అతని టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రియదర్శన్ దీనికి దర్శకత్వం వహించారు. సమ్మర్ 92గా ఇది రూపొందింది.
3. అద్భుతం: ప్రాజెక్టు అగ్ని పేరుతో ఇది రూపొందింది. అరవిందస్వామి డ్రిఫ్టర్ అనే కొత్త మెషీన్ కనిపెట్టడం, దాంతో ఎక్కడో ఉన్న ఆలోచనలను వెలికితీయడం ప్రధాన అంశం. దాన్ని ఇస్రోలో పనిచేస్తున్న తన స్నేహితుడు ప్రసన్నతో చెబుతాడు. ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందింది. అరగంట పాటు అద్భుతంగానే దీన్ని తీర్చిదిద్దారు. అందరూ ఎంజాయ్ చేసే ఎపిసోడ్ ఇది. కార్తీక్ నరేన్ దీనికి దర్శకత్వం వహించారు.
4. బీభత్సం: పాయసం పేరుతో ఇది రూపొందింది. దీనికి వసంత్ దర్శకత్వం వహించారు. అదితి బాలన్, రోహిణి, ఢిల్లీ గణేశ్ ప్రధాన పాత్రధారులుగా ఇది తెరకెక్కింది. మేనల్లుడిని చూసి అసూయ పడే వ్యక్తి కథ ఇది. 70 ఏళ్ల వయసున్న సోమనాథ తన అసూయ కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదొర్కాన్నారో చూడాల్సిందే. ప్రేక్షకులు కూడా అసహ్యించుకునే పాత్ర ఇది.
5.శాంతం: బాబీ సింహా, గౌతమ్ మేనన్ కీలక పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దీన్ని రూపొందించారు. శ్రీలంక నేపథ్యంలో కథ సాగుతుంది. ఓ పిల్లాడిని కాపాడటానికి వెళ్లిన బాబీ సింహకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే కథ. దర్శకుడిలో స్పష్టత లోపించడం వల్ల దీనికి న్యాయం చేయలేకపోయారనిపిస్తుంది.
6. రౌద్రం: నటుడిగా పేరు తెచ్చుకున్న అరవిందస్వామి దర్శకుడిగా నిరూపించుకోడానికి చేసిన ప్రయత్నం ఇది. ఇందులో రిత్విక, శ్రీరామ్, అభిమన్యు శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కూడా హత్యతో ముడిపడిన కథే. తల్లికి జరిగిన అవమానం హత్యకు దారితీస్తుంది. ఆ అవమానం ఏమిటనేదే ఇందులో కొసమెరుపు. దర్శకుడిగానూ అరవిందస్వామి సక్సెస్ అయ్యారు.
7. భయానకం: ప్రేమ-పగ-నమ్మకం-ద్రోహం.. ఈ అంశాలు ప్రధానంగా ఇది రూపొందింది. పార్వతి, సిద్ధార్థ్ ల మధ్య కాలీగ్రాఫీ చర్చ జరగడం, ఆమె గతాన్ని అతను చెబుతాడు. ఆమెలోని భయాన్ని పోగొట్టడానికి ఏం చేయాల్సి వచ్చిందన్నదే కథ. కథనంలో ఉత్కంఠ లోపించింది. దీనికి రతీంద్రన్ దర్శకత్వం వహించారు.
8. వీరం: అధర్వ, అంజలి, కిషోర్ కీలక పాత్రలు ఈ ఎపిసోడ్ రూపొందింది. దీనికి సర్జున్ కె. ఎం. దర్శకత్వం వహించారు. ఓ ఇన్ స్పెక్టర్ నక్సలైట్ ను పట్టుకోవడం అంశంగా తెరకెక్కింది. ఇందులో వీరత్వాన్ని ఎవరు ప్రదర్శించారో చూడాలి. ఆశించినంతగా వీరత్వం పండలేదు.
9. శృంగారం: శృంగార రసం అంటేనే ప్రేమ కథ ఉండాలి. సూర్య, ప్రగ్య ప్రధాన పాత్ర ధారులుగా ఈ ప్రేమ కథ రూపొందింది. గిటార్ వాద్యాకారుడైన సూర్య ప్రేయసిని ఎలా కలుసుకున్నాడన్నదే ఇందులో ప్రధాన అంశం. దీనికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. సంగీతానికి ఇందులో స్కోప్ ఉంది. పాటలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు దీన్ని రసరంజకంగా తీర్చిదిద్దారు.
ఒక్కమాటలో: అందరినీ ఇలా సమీకరించి చేయడం మాటలు కాదు. ఎవరికి వారు డెడికేషన్ తో ఇందులో లీనమై చేశారు. ముఖ్యంగా ప్రతిఫలం ఆశించకుండా నవరసాలను పండించారు.
రేటింగ్: 2.5/5











