‘బంగారు బాతుగుడ్డు బందారు చెక్కెర లడ్డు, చీమకుట్టిందా చిమచిమలాడిందా, పప్పులో ఉప్పేసి కసాపిసా కలిపినట్టు, బంగెనపల్లి మామిడి పండు, కట్టుకో కట్టుకో కట్టుకో పట్టుచీర ,అరటిపండు ఒలిచిపెడితే తినలేని చిన్నది ఆదమరిచి ఊరుకుంటే చెలరేగుతున్నది, గేర్ మార్చు స్పీడు పెంచు, తొంగి తొంగి చూడమాకు చందమామ’. పంచమి పూట మంచిదని.. లాంటి పాటలు ఎందుకు జనరంజకమయ్యాయి? ఎందుకు అంతగా రసహృదయుల్ని ఉర్రూతలూపాయి? అంటే దానికి ఒకటే కారణం.. ఆ పాటల్లో అభినయించిన యన్టీఆర్, ఎఎన్నార్ లు తమ సొంతగొంతుతో పాడినట్టు అనిపించడమే. ఆ పాటల్ని వారు పాడలేదని అందరికీ తెలుసు. అయినప్పటికీ వాళ్ళకి ఆ ఫీల్ ను కలిగించి.. ఆ పాటల్ని పదే పదే వినాలనే కాంక్షను రగిలించాయి.
ఆ పాటల వెనుక గాన గంధర్వుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం అనుకరణ మహేంద్ర జాలం అంత బలంగా పనిచేసిందన్నమాట. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’తో ఎస్పీబీ .. గాయకుడిగా తెలుగు తెరమీద స్వరంగేట్రం చేసినప్పుడు మామూలు బాలుడిగానే అందరికీ తెలుసు. ఆ టైమ్ లో పూర్తిగా ఘంటసాల ఆధిపత్యం నడుస్తోంది. అదే సమయంలో పీబీ శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరరావు లాంటి గాయకులు అదర్ ఆప్షన్ గా పాడేవారు. అయితే వీరిందరి కన్నా విభిన్నమైన గొంతుతో బాలు అందరినీ ఆకర్షించడం మొదలు పెట్టారు. సినిమాకి ఒకటీ అరా పాటలు, ఒకోసారి నాలుగు పాటలు కూడా పాడే స్టేజ్ కొచ్చారు బాలు. అదే టైమ్ లో టీవీ రాజు నుంచి యన్టీఆర్ సినిమాలో ఒక పాట పాడడానికి పిలుపొచ్చింది బాలసుబ్రహ్మణ్యంకి.
మరో పక్క పద్మనాభం లాంటి కమెడియన్స్ కి కూడా బాలు పాటలు పాడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోకూడదు. ఎందుకంటే.. ఘంటసాల మాస్టారు యన్టీఆర్ కి, ఎఎన్నార్ కి పాడే పాటల్ని ప్రేక్షకులు అలవాటు పడ్డ పరిస్థితి అది. అప్పుడు బాలు యన్టీఆర్ సినిమాకి పాటపాడేసి.. పద్మనాభం సినిమా కి కూడా పాడపాడారు. అయితే అందులో పద్మనాభం ని బాలు అద్భుతంగా ఇమిటేట్ చేయడంతో .. బాలుపాట తెలుగు పరిశ్రమలో మార్మోగిపోయింది. ఆ తర్వాత మరో సినిమాలో రాజబాబు ను కూడా బాలు అచ్చంగా అలాగే ఇమిటేట్ చేయడంతో.. కొంత కాలంపాటు బాలసుబ్రహ్మణ్యం కమెడియన్స్ కే ఫిక్స్ అయ్యారు. అలాగే.. మరో పక్క కృష్ణ సినిమాలకి కూడా బాలు సింగర్ గా మారారు. అదే టైమ్ లో వి.రామకృష్ణ గాయకుడిగా ప్రవేశించారు.
తొలి పాటతోనే ఘంటసాల లాంటి గొంతు అనే ప్రశంసలు అందుకున్నాడు. కొంత కాలం రామకృష్ణ అలా మంచి పాటలు పాడుతూ.. యస్పీ బాలసుబ్రహ్మణ్యంతో సమానంగా అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టారు. అయితే అప్పుడే ఘంటసాల మాస్టారి ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. ఆయన పాటలు పూర్తిగా తగ్గించేసి అప్పుడప్పుడూ మాత్రమే పాడేవారు. ఆ గ్యాప్ లో యన్టీఆర్ కి, ఏఎన్నార్ కి ఘంటసాల తర్వాత .. రామకృష్ణ మరో ఆప్షన్ గా మారారు. ఆ దశలోనే ఆయన చాలా మంచి పాటలు పాడారు. దాంతో బాలు సింగింగ్ కెరీర్ కి ప్రమాద ఘంటికలు మోగాయి.
ఆ సమయంలోనే ఒక ప్రముఖ సంగీత దర్శకుడు బాలుకి ఒక అమూల్యమైన సలహా ఇచ్చారు. ‘బాలూ.. నీకు అవకాశాలు రావాలంటే.. రెండే రెండు మార్గాలు.. ఒకటి ఘంటసాలనైనా ఇమిటేట్ చేయి… రెండు హీరోలనైనా ఇమిటేట్ చేయి అన్నారట. అందులో బాలు రెండో ఆప్షన్ ను ఎన్నుకొని.. ఎన్టీఆర్ ని, ఏఎన్నార్ ని ఇమిటేట్ చేస్తూ పాడాలని నిర్ణయించుకున్నారు. ఆ టైమ్ లో నే యన్టీఆర్ ‘మాయా మశ్చీంద్ర’లోని ప్రణయ రాగ వాహిని అనే పాటను అచ్చం ఎన్టీఆర్ లాగానే పాడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు బాలు.
ఆ తర్వాత దాన వీర శూరకర్ణలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాట కూడా బాలు పాడడంతో.. అది సెన్సేషనల్ హిట్ అయిపోయింది. మరో పక్క ఆలుమగలులో చిగురేసి మొగ్గేసి , ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను పాటలు ఏఎన్నార్ గొంతుతో దింపడంతో .. బాలు సామాన్యమైన వాడు కాదని అప్పుడు అందరికీ అర్ధమైంది. దాంతో యన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు బాలుతోనే పాటలు పాడించమనేవారు. బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల కి ప్రత్యామ్నాయంగా మారడంతో ..రామకృష్ణ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. అప్పటి నుంచి బాలు ఆ ఇద్దరి హీరోలకి కొన్ని దశాబ్దాల కాలం పాటు పాటలు పాడి … అభిమానుల్ని అలరించారు. ఇక బాలసుబ్రహ్మణ్యం అల్లు రామలింగయ్య, సుత్తివేలు ని సైతం ఇమిటేట్ చేసి .. అనుకరణ చక్రవర్తి అనిపించుకున్నారు.
ఇక ఎన్టీఆర్ తర్వాత తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల సినిమాలకి కూడా బాలునే పాటలు పాడి… అప్పుడూ అద్భుతాలు సృష్టించారు. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకూ .. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడుతునే ఉన్నారు. దాదాపు 5 శతాబ్దాల కాలం పాటు… అనేక భాషల్లో మొత్తం 40 వేల పాటలు పాడడం అనేది ఒక్క బాలసుబ్రహ్మణ్యం కే సాధ్యమైంది . అలాగే.. ఆయనలా హీరోల గొంతుల్ని ఇమిటేట్ చేస్తూ.. మెలోడీ ని కొనసాగిస్తూ.. .. పాటలు పాడే మొనగాడు మరొకరు ఇప్పట్లో రావడం అసాధ్యమే.











