ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి కొత్త కార్యవర్గం ఆదివారం (27న) ప్రకటిస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రాష్ట్రపార్టీ అధ్యక్షుడి పేరును మాత్రం ఆదివారం ప్రకటించబోవడం లేదు.
ఈసారి రాష్ట్రంలో పార్టీని పునర్ వ్యవస్థీకరించే ప్రయత్నంలో భాంగా కొత్త వ్యూహాన్ని చంద్రబాబునాయుడు అనుసరిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా.. కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇకమీద తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలు ఉండవు. ఇవే జిల్లా కమిటీలను రీప్లేస్ చేస్తాయి. సమీప భవిష్యత్తులో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్న తరుణంలో.. దానికి అనుగుణంగానే చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల కొత్త జిల్లాల విషయంలో జగన్ నిర్ణయానికి చంద్రబాబు ముందే జై కొట్టినట్టు అయిందని ది లియో న్యూస్ డాట్ కామ్ ఒక కథనం అందించింది. ఆ కథనంలో విషయమే నిజం అయింది.
ఇప్పుడు ఆదివారం నాడు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు కమిటీలు వేయబోతున్నారు. ఉదయం 11.50 గంటలకు చేసే ప్రకటనలో పార్లమెంట్ ఒక యూనిట్‌గా.. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు.. 25 మంది అధ్యక్షులను చంద్రబాబు నియమించనున్నారు.
అచ్చెన్న నో అన్నారా?
రాష్ట్ర పార్టీ సారథ్యాన్ని అచ్చెన్నాయుడుకు కట్టబెడతారని తొలుత వార్తలు వచ్చాయి. పార్టీ నిర్ణయాల విషయంలో కొంత స్వేచ్ఛ కావాలని, యువరక్తం పార్టీలో ఉండాలని అచ్చెన్నాయుడు చంద్రబాబుకు కండిషన్ పెట్టినట్టుగా కూడా కర్ణాకర్ణిగా సమాచారం వచ్చింది. ఏమైందో తెలియదు గానీ.. ఆదివారం నాటి ప్రకటనలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి విషయం ఉండదని తెలుస్తోంది.
అచ్చెన్నాయుడు పగ్గాలు అందుకోవడానికి నో చెప్పారా? లేదా, ఆయనకు సారథ్యం అందించే విషయంలోొ చంద్రబాబునాయుడే పునరాలోచనలో ఉన్నారా? అనేది ఇదమిత్థంగా తెలియడం లేదు.











