కనీసం 30 శాత పీఆర్సీ ఇవ్వాలి ..
27 శాతం ఐఆర్ ఇస్తూ.. 23 శాతం ఫిట్మెంట్ ను జగన్ ప్రభుత్వం ప్రకటించడం, దానిని ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించడం.. ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే యూటీఎఫ్, పీడీఎఫ్, మున్సిపల్ ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. పెండింగ్ బకాయిలుగా ఉన్న డీఏలను ఒకేసారి కలిపేసి 11వ పీఆర్సీ వల్ల జీతం తగ్గదని అనడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీలా భవిష్యత్ పీఆర్సీ ఉంటుందని ప్రకటించడం వల్ల 2023 నుంచి అమలు చేయాల్సిన 12వ పీఆర్సీని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోల్పొతారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 23 శాతం ఫిట్మెంట్ తో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనదారులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కనీసం 30 శాత పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. మరోవైపు తక్కువ ఫిట్మెంట్ కు ఒప్పుకున్న ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం వ్కక్తం చేస్తున్నారు.
గుంటూరులో ఉద్యోగుల నిరసనలు..
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ.. గుంటూరు నగరంలో మున్సిపల్ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒరిగేదేమి లేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెనాలి, మాచర్లలో ఎస్టీయూ ఆధ్వర్వంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరనలకు దిగారు. సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పీఆర్సీని పెంచాలని డిమాండ్ చేశారు.











