కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రాణాలకు తెగించి పనిచేశారని, అలాంటివాళ్లను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉద్యోగ భద్రత కోసం దీక్ష చేస్తున్న వారియర్స్ పట్ల సానుభూతి చూపకపోగా, నిర్లక్ష్యంగా వ్యహరించడం దుర్మార్గమని ఆయన అన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వర్తించే వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం, విధుల నుంచి తొలగిస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు.
ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా, విధుల నుంచి తొలగించడం పట్ల తీవ్రంగా ఖండిస్తన్నట్లు చెప్పారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు, కార్యకర్తలకు కట్టబెట్టే ప్రభుత్వం, వారియర్స్ పట్ల కఠినంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ సమస్యలను పరిష్కరించకపోతే, వాళ్లతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.