‘కర్మ, కిస్, పంజా’ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ.. అడివి శేష్ కి ‘బాహుబలి’ సినిమా తోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’ ‘గూఢచారి’, ‘ఎవరు’ లాంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇంక తను వెనుతిరిగి చూసుకోలేదు. శేష్ హీరో మాత్రమే కాదు మంచి స్క్రీన్ ప్లే రైటర్ కూడా. ప్రస్తుతం అడివి శేష్ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘గూఢచారి’ మూవీ డైరెక్టర్ శశి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా సోనీ ఇంటర్ నేషనల్ ప్రొడక్షన్స్, జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. అదేమిటంటే 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో ‘మేజర్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. ప్రభుత్వం షూటింగ్లకు పెర్మిషన్ ఇచ్చినా ఈ సినిమా షూటింగ్ ఎందుకనో పట్టాలెక్కలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుందట.
ఈ లాక్ డౌన్ కాలంలో అడవి శేష్ ఫిట్ నెస్ పై తన దృష్టిని పెట్టాడు. జిమ్ లో కసరత్తులు చేసి ఫిట్ గా మారిన అడివి శేష్ షూటింగ్ కు సిద్ధమే అనే సంకేతం ఇచ్చాడు. తన లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది. ఇక ‘మేజర్’ సినిమా పై శేష్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం వరుస సినిమాలు హిట్లు అవ్వడమే. ‘మేజర్’ సినిమా ద్వారా శేష్ ఇంకొక మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.











