అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్ రెడ్డికి, ఆయన పార్టీకి ఏనాడూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు రాలేదు. కానీ అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే పదాలను పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ నమ్మబలుకుతున్నారు జగన్. 2019-24 మధ్య రాష్ట్రంలో జగన్, ఆయన పార్టీ నేతలు చేసిన అరాచకాలు, అక్రమాలు అన్నీఇన్ని కావు. కానీ ఇప్పుడు అవేమి జగన్‌కు గుర్తుకు రావడం లేదు. ఆయన పూర్తిగా ఇప్పుడు గజినీలా మారిపోయారు. న్యాయం, ధర్మం, నీతి నిజాయితీ, మానవత్వం అన్నీ మంట గలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరును చూసి పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.
మంగళవారం తాడేపల్లి ప్యాలెస్‌లో వైసీపీ లీగల్ సెల్ సభ్యులతో సమావేశమైన జగన్..నీతిబోధలు చేశారు. మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని నమ్మబలికారు. కానీ ఆయన మాటల్లో ఆ స్పష్టత కనిపించలేదు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు టీడీపీ నేతలను, ఆఖరుకు చంద్రబాబును సైతం అక్రమంగా జైల్లో పెట్టించిన జగన్..ఇప్పుడు అరెస్టులపై నీతిసూక్తులు చెప్పారు. ఒక మనిషిని జైల్లో పెట్టడమంటే ఆ వ్యక్తి పరువు, ప్రతిష్ఠలతో ఆడుకోవడమేనన్నారు జగన్. కానీ ఇవేమి సీఎంగా ఉన్న టైంలో ఆయనకు గుర్తు రాలేదు. 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే కలియుగమంటే ఇదే కదా అనిపిస్తోందంటూ జగన్ చెప్పడం హాస్యాస్పదం. రాష్ట్రంలో ఎక్కడా న్యాయం, ధర్మం లేదంటూ మొసలి కన్నీరు కార్చారు జగన్.
తర్వాత వెంటనే అపరిచితుడిలాగా మారిపోయారు జగన్. పార్టీ కోసం కష్టపడుతున్న వారికోసం డేటాబేస్ తయారు చేస్తున్నామన్నారు. ఇందుకోసం లాయర్ల పర్యవేక్షణలో సిద్ధం చేసిన ‘యాప్’ను త్వరలో ఆవిష్కరించబోతున్నామని చెప్పారు. ఏ కార్యకర్తయినా వారిని ఇబ్బంది పెట్టిన అధికారి పేరు, హోదాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే అది మా దగ్గర డిజిటల్ లైబ్రరీకి చేరుతుందని, దెబ్బతగిలినోడి బాధ, ఆ దెబ్బ కొట్టినోడికీ తెలిసేలా చేసేందుకే ఈ యాప్ అని చెప్పుకొచ్చారు. అధికారంలోకొచ్చాక ఈ డిజిటల్ లైబ్రరీని తెరిచి, అందులో ఉన్న డేటా ప్రకారం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. మరీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం గత ఐదేళ్లూ అరాచకాలు, అక్రమాలు చేసిన వారినే కదా అరెస్టు చేయిస్తోంది. ఈ చిన్న లాజిక్‌ను జగన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు.











