ఏపీ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టుల కోసం భూములు తీసుకుని ఎలాంటి పనులు ప్రారంభించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. ప్రధానంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ₹4 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్న ప్రాజెక్టులపై ఆయన ఫోకస్ పెట్టారు. భూములను తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పనులు ప్రారంభించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్, ఇండోసాలార్, ఎకోరెన్ ఎనర్జీ వంటి పలు పెద్ద కంపెనీల ప్రాజెక్టులు సైతం పరిశీలనలో ఉన్నాయి. ఈ సంస్థలు భూములను కేటాయించుకుని ప్రాజెక్టులను ఆలస్యం చేయడం వల్ల రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధన నెమ్మదిస్తోంది. ఇప్పుడు, ప్రభుత్వం ప్రాజెక్టుల పురోగతిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయాలని, 2030 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ చర్యలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో జవాబుదారీతనాన్ని పెంచనున్నాయి. ప్రాజెక్టులను ఆలస్యం చేసే సంస్థలపై చర్యలు తీసుకోవడం ద్వారా, ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుస్తుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ రంగంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టడానికి దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు











