ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇటీవల నోట్ల గుట్టల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఆ డబ్బును లెక్కిస్తూ కనిపించారు. ఐతే ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి మా పార్టీ నేతలకు సంబంధం లేదని వైసీపీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. వెంకటేష్ నాయుడు బీజేపీ,టీడీపీ నేతలతోనూ ఫోటోలు దిగాడని అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేసింది. ఐతే ఈ విమర్శలను తిప్పికొట్టారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.
ఏపీలో లిక్కర్ స్కామ్ పక్కాగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లోనే జరిగిందని, దానిపై విస్తుపోయే నిజాలు, నగదు కట్టలు, వీడియోలు బయటకు రావడంతో వైకాపా మీడియాలో అబద్ధాలు వండి వారుస్తున్నారని మండిపడ్డారు పట్టాభిరామ్. వివేకా హ*త్య తరహాలోనే..మద్యం కుంభకోణంలో నిందితుడైన వెంకటేశ్‌నాయుడిని టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పారు. మద్యం కుంభకోణంలో ఉన్న వెంకటేశ్ నాయుడు.. చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితుడని చెప్పారు పట్టాభి. చెవిరెడ్డి ఆర్థికాంశాలను వెంకటేష్ నాయుడు చూసేవారని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దొంగతనం బయటపడేసరికి వెంకటేష్ నాయుడు టీడీపీకి చెందినవాడంటూ వైసీపీ దొంగ నాటకాలు ఆడుతోందన్నారు. ప్రజాదర్బారుల్లో కొన్ని వందలమంది వచ్చి చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు దిగుతారని,అంతమాత్రాన..ఫలానావాళ్ల మనిషి అని చెప్పలేమన్నారు పట్టాభి. కానీ వెంకటేశ్‌నాయుడు జగన్, చెవిరెడ్డిలకు అత్యంత సన్నిహితుడని చెప్పడానికి సాంకేతిక ఆధారాలున్నాయని స్పష్టం చేశారు.
ఇక వెంకటేశ్‌నాయుడు 2023 జూన్ 6న విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్యలతో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నారని చెప్పారు. జూన్ 18న అపోలో ఆస్పత్రి వద్ద మిథున్‌రెడ్డిని, జూన్ 27న సైమన్‌ను బయోలాజికల్ ఈ లిమిటెడ్ వద్ద, ఆగస్టు 8న కృష్ణమోహన్‌రెడ్డిని మెహదీపట్నంలోను, ఆగస్టు 9న ఈశ్వర్‌కుమార్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిదగ్గర, ఆగస్టు 13న సజ్జల శ్రీధర్‌రెడ్డిని మెహదీపట్నంలోను కలిశారని ఆధారాలు చూపించారు. ఇంతమందిని కలిసినా మీవాడు కాదని ఎలా చెబుతారని వైసీపీని ప్రశ్నించారు పట్టాభి. చెవిరెడ్డి తనతో పాటు వెంకటేశ్‌నాయుడిని కొలంబో తీసుకెళ్లాలని చూశారని, ఏ సంబంధం లేకపోతే ఎందుకు తీసుకెళ్లాలనుకుంటారో చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లో చెవిరెడ్డికి డమ్మీ అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు ఎందుకు నామినేషన్ వేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు











