(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రవేటీకరణ ఆపకపోతే మరో ఉద్యమం తప్పదని అఖిల పక్షాలు స్పష్టం చేశాయి. సోమవారం స్థానిక హోటల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీయేతర రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జెండాలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ఎజెండాగా అన్నిపార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఉద్యమానికి కార్మికుల కుటుంబాల మద్దతు
సమావేశంలో పాల్గొన్న ట్రేడ్ యూనియన్ నాయకుడు ఆదినారాయణ మాట్లాడుతూ ప్రయివేటీకరణ వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డునపడతాయని, కేవలం కార్మికులే కాదని వారి కుటుంబాలు కూడా ఉద్యమానికి మద్దతుగా పోరాడతాయన్నారు. సీపీఐ నాయకుడు జెవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రజలను ఏమార్చి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ముందుగా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమస్ఫూర్తి రగిలించిన గంటా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. యూనియన్ నాయకుడు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రవేటీకరణకు పూర్తి వ్యతిరేకమన్నారు. అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యోగ భద్రతే లక్ష్యంగా పోరాడతామన్నారు. ఉక్కు గనులు కేటాయిస్తే స్టీల్ ప్లాంటుకు నష్టమనే మాటే రాదన్నారు. విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖ స్టీల్ ప్లాంటుకు పునాదిరాయి వేశారన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాసారని, కేంద్రం మెడలు వంచేలా తమ పార్టీ పోరాడుతుందన్నారు.
భూములు కొట్టేయాలనే..
తెలుగు దేశం విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోస్కోకు కానీ, బీజేపీ ప్రభుత్వానికి కానీ ప్లాంట్ అభివృద్ధి ముఖ్యం కాదని, కేవలం ప్లాంట్‌కు ఉన్న భూములు కొట్టేయాలన్నదే వారి ఉద్దేశమన్నారు. జింక్ ఫ్యాక్టరీకి పట్టిన గతే స్టీల్ ప్లాంటుకు కూడా పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో కూడా ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరిగితే చంద్రబాబు నేతృత్వంలో అప్పటి ప్రధాని వాజపేయిని కలిసి అడ్డుకున్నారన్నారు. ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఉద్వేగంగా చెప్పారు. ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అమ్ముకోవడం మోడీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. రాజీనామా చేసి ఉద్యమానికి ఊపు తెచ్చిన గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన రాజీనామాను కొంతమంది అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే అన్ని పదవులు అనుభవించేశానని, విశాఖ ప్రజలు పెట్టిన బిక్ష తనను ఇంత వాడిని చేసిందన్నారు. మీడియా ప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఖాళీ లెటర్ హెడ్ వారికి ఇచ్చి తమ రీతిలో రాసుకోవచ్చని, సంతకం పెడతానని ఉద్వేగంగా చెప్పారు. అసెంబ్లీని వెంటనే సమావేశ పరిచి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, అలాగే కాబినెట్ సమావేశంలో కూడా తీర్మానించి కేంద్రానికి పంపాలని జగన్‌కు సూచించారు. సమావేశం ఆద్యంతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలతో మార్మోగిపోయింది.











