పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఇది. తమిళ సూపర్ స్టార్ అజిత్ వాలిమై చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి బరిలోకి ఈ వాలిమై దిగుతోంది. ఈ సినిమాని తమిళనాట జనవరి 12 లేదా 13న విడుదల చేయాలన్న ఆలోచన ఉంది. ఈ వాలిమై చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచన బోనీకపూర్ లో ఉంది. దీన్ని తెలుగులో చేయడానికి బెస్ట్ చాయిస్ పవన్ కళ్యాణే అని ఆయన భావిస్తున్నారు. ఇంతకుముందు పవన్ తో వకీల్ సాబ్ చేసిన అనుభవం ఎలాగూ ఉంది కాబట్టి పెద్ద సమస్య కూడా ఉండదు.
కాకపోతే పవర్ స్టార్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాలిమై విడుదలైన తర్వాతే బోనీ ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అజిత్ ఇంతకుముందు నటించిన వీరమ్ చిత్రం రీమేక్ లో పవన్ నటించిన సంగతి తెలిసిందే. కాకపోతే చేతినిండా సినిమాలతో ఉన్న పవన్ కు ఇది ఎలా సాధ్యమవుతుందన్నది అందరి ముందూ ఉన్న ప్రశ్న. వాలిమై చిత్రాన్ని తెలుగులోనూ అనువదించి ఒకేసారి విడుదల చేయాలన్న ఆలోచన బోనీకపూర్ కు వచ్చినా దాన్ని అమలు చేయడం లేదు. సంక్రాంతి బరిలోకి దీన్ని దించితే ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ చిత్రాలతో సమస్య ఉంటుంది. ఎక్కువ థియేటర్లను ఇవే ఆక్రమిస్తాయి.
అందువల్ల తెలుగులోకి అనువదించి విడుదల చేసే విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సినిమా విషయం అలా ఉంటే సముద్ర ఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘వినోదయ సీతమ్’ చిత్రాన్ని కూడా పవన్ తో రీమేక్ చేసే ఆలోచన ఉంది. తంబి రామయ్యతో కలిసి సముద్ర ఖని కూడా నటించారు. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కూడా నటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఇది కూడా మల్టీస్టారర్ చిత్రమవుతుంది. అయితే ఇందులో పవన్ పోషించేది దేవుడి పాత్ర అట.
తంబి రామయ్య చనిపోవడం, పరలోకంలోకి వెళ్లినా అక్కడ ప్రశాంతత లేకపోవడంతో అతడ్ని దేవుడు కారణమేంటని అడుగుతాడు. తనను మూడు నెలల పాటు బతికించాలని అతను కోరతాడు. అలా భూమ్మీదకు వచ్చిన తంబిరామయ్య ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా చేసిన తర్వాతే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ నటిస్తాడని సమాచారం. మరి వాలిమైకి సంబంధించి ఏం జరుగుతుందన్నది ఇంకా క్లారిటీ లేదు.











