ఆకాష్ పూరి.. దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా వెండితెరకు పరిచయమై అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో. రీసెంట్ గా అతడు హీరోగా నటించిన ‘మెహబూబా’ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆకాష్ పూరి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆకాష్ ‘రొమాంటిక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తుండగా కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది. కాని దేశంలో లాక్ డౌన్ వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. ఈమధ్యనే సినిమా షూటింగ్ తిరిగి మొదలై పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా ‘రొమాంటిక్’ సినిమా పనులు త్వరగా పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ తో సంప్రదింపులు జరిపారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
అన్నీ కుదిరితే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకం పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై పూరి జగన్నాథ్ పూర్తి నమ్మకంతో ఉన్నాడని తెలుస్తోంది. ఈసారి ఆకాష్ పూరి తప్పకుండ మంచి విజయం అందుకుంటాడని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటుగా హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందో లేదో చూడాలి మరి.