(విశాఖపట్టణం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు పేరిట ప్రభుత్వం ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని తొలగింపులు చేపడుతోంది. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో అంగుళం ప్రభుత్వ భూమిని కూడా పరాధీనం కాకుండా కాపాడతామని ప్రకటించిన ప్రభుత్వం… విశాఖలోని అన్ని నిర్మాణాలు , ఆక్రమణలపైన చర్యలు తీసుకోగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే విశాఖలో ప్రముఖ ప్రాంతమైన గాజువాక మొత్తం నేలమట్టం చేయాల్సి వస్తుంది. ఇక్కడి భూములపై 1970 నుంచి వివాదం నడుస్తోంది. అప్పటి నుంచి ఇక్కడి భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదు. సుమారు 900 ఎకరాల భూములకు సంబంధించిన వివాదం ప్రైవేటు వ్యక్తులు, రెవెన్యూ శాఖ మధ్య కోర్టు పరిధిలో నలుగుతోంది. కానీ ఆయా భూముల్లో వేలాది నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికీ అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. గాజువాక ప్రధాన రహదారిలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే కమర్షియల్ భవనాలకు సైతం ఎటువంటి అనుమతులు లేవు.
గత ప్రభుత్వం హయాంలో ఉపశమనం..
గాజువాక భూ సమస్య పరిష్కారానికి గతంలో హౌస్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు.. టీడీపి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ప్రత్యేక జీవోను జారీ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే ఇందులో కోర్టు తీర్పు అనుసారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తొమ్మిది వందల ఎకరాల్లో చాలా నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ప్రకారం చూస్తే గాజువాకలో ఉన్నవన్నీ అక్రమ నిర్మాణాలు.. భూ అక్రమణలే… మరి గాజువాకను టచ్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అటు వైపు కన్నెత్తి చూస్తే ప్రభుత్వం పునాదులు కదిలి పోతాయి. అక్రమ నిర్మాణాలు కూలగొడుతూ పోతే … ఊళ్లు అన్ని వళ్ల కాళ్ళు అవుతాయి. ప్రతిపక్ష నాయకులే టార్గెట్‌గా చేస్తున్న తొలగింపుల ప్రక్రియకు ఇప్పటికైనా ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలి.