(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
3 రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని కల చెదిరింది. రాజధానికి స్వచ్ఛంధంగా భూములిచ్చిన 29 గ్రామల రైతులు రోడ్డున పడ్డారు. ఏటా మూడు పంటలు పండే 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛంధంగా ఇచ్చి తప్పు చేశామా అంటూ రాజధాని రైతులు దీనంగా ప్రశ్నిస్తున్నారు? 3 రాజధానుల ప్రకటన వెలువడి నేటికి సరిగ్గా 250 రోజులు అవుతోంది. ఆ రోజు నుంచి రాజధాని గ్రామాల రైతులు తమదైన శైలిలో ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం కనికరించడం లేదు.
గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరాకు రూ.30 వేల కౌలును కూడా నిలిపివేశారు. దీంతో పది మందికి అన్నం పెట్టే రైతులు ఆకలి కేకలు ఇప్పుడు పెడుతున్నారు. ఎకరా అర ఎకరాతోపాటు, కొందరు భూ స్వాములు రాజధానికోసం 40 ఎకరాలదాకా భూములు ఇచ్చారు. ఒకప్పుడు మూడు పంటలు పండిస్తూ ఏటా వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పించిన రైతన్న నేడు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇల్లు గడిచేది ఎలా? పంటలు సాగు చేసుకుందామంటే భూమి లేదు, కూలీ పనులకు పోదామన్నా పనీ లేదు. ఇక బతికేది ఎలా అంటూ రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కుటుంబాలు ఎలా ఛిద్రమైపోయాయంటే…
అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల ఆరేళ్ల కిందటి వరకూ తమ భూముల్లో ఏటా మూడు పంటలు పండించారు. చిన్న, సన్నకారు రైతులు అంటే అర ఎకరా నుంచి 5 ఎకరాల్లోపు భూములున్న వారు ఎక్కువగా ఉన్నా… సారవంతమైన భూములు, నీటి సదుపాయం బాగా ఉండటంతో వారి కుంటుబాలు సాఫీగా సాగిపోయాయి. రాజధానికి భూములిచ్చినప్పటి నుంచీ వారి ఆర్థిక సామాజిక పరిస్థితి దిగజారిపోయింది. గత ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.30 వేలు కౌలు చెల్లించింది. ఒక రకంగా చెప్పాంటే అదికూడా తక్కువే. ఎందుకంటే ఇక్కడి రైతులు 3 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే కనిష్ఠంగా 7 లక్షల ఆదాయం తీస్తారు. నేడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒక వైపు భూములు కోల్పోవడంతోపాటు, పాలనా వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు ప్రకటించడంతో… ఒకప్పుడు గజం రూ.25 వేల నుంచి రూ.40 వేలు పలికిన భూములు నేడు గజం రూ.5 వేలకు కూడా కొనేవారు లేరు. దీంతో రైతులు ఉధ్యమం బాట పట్టారు. 250 రోజులుగా తమ బతుకుల కోసం పోరుబాట పట్టారు.
ఈ ఉధ్యమంలో ఇప్పటికే 60 మంది చనిపోయారు. అనేక మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒకప్పుడు ఇక్కడి రైతుల మోములో చిరునవ్వు కనిపించేది, నేడు అది కనుమరుగైంది. ఏ రైతును కదిలించినా కన్నీరే వస్తున్నాయి. రాజకీయ నాయకుల చదరంగంలో అమాయక రైతు చిత్తవుతూనే ఉన్నాడు.
ప్రభుత్వం ఆలోచన వేరు..
తాజాగా వైసీపీ ప్రభుత్వం CRDA ని రద్దు చేసి అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీంతో గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలు కూడా రద్దయ్యాని నేటి ప్రభుత్వం భావిస్తోంది. అయితే పాలనా వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు కేసులు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. దీంతో కొత్త పాలనా రాజధానికి అధికారికంగా శంకుస్థాపన వాయిదా పడింది.
అక్కడ అతిథిగృహమా.. అసలు భవనమా?
అయితే ఇప్పటికే విశాఖలో 30 ఎకరాల్లో పెద్ద అతిధి గృహం పేరుతో ఆగష్టు 15వ తేదీ శంకుస్థాపన జరిగిపోయింది. పేరుకే అతిథి గృహం అని చెబుతున్నా… దాాదాపుగా అక్కడ నుంచే పాలన కొనసాగించే విధంగా డిజైన్లు రూపొందిస్తున్నారని వినికిడి. ఈ భవనాలను 8 నెలల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.కొత్త రాజధాని భవనాలు అని ఎక్కడా ప్రకటించకుండా చాపకింద నీరులా ప్రభుత్వం తన పని తాను కానించుకుపోతోంది. ఇక రైతుల ఆశలన్నీ సుప్రీంకోర్టు, హైకోర్టుపైనే పెట్టుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలో వచ్చే తీర్పులనైనా వైసీపీ ప్రభుత్వం గౌరవిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.











