ప్రకాశం జిల్లాలో ఎస్.ఐ. బదిలీల వ్యవహారం పోలీస్ వర్సెస్ వైసీపీ నేతలుగా మారుతోంది.
(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
బదిలీలకు రంగం సిద్ధమైనా, ఉత్తర్వులు రావడం ఆలస్యం కావడంతో ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా బదిలీలపై ఒక అవగాహనకు వచ్చి.., తమకు కావాల్సిన వారిని నియమించాలని.., కొందరి పేర్లతో కూడిన జాబితాను ఎస్పీకి ఇచ్చారు. కానీ, ఇంత వరకూ వారి సిఫార్సులు ముందుకు కదలకపోవడంతో తమ ప్రభుత్వంలో వైసీపీ నేతల మాటకు విలువలేదా? అని అసంతృప్తితో ఉన్నారు. మంత్రి బాలినేనిని కలిసి బదిలీల ఆలస్యంపై ఫిర్యాదు కూడా చేశారు.
ఎస్పీపై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి..!
వైసీపీ ఎమ్మెల్యేలు ఎస్.ఐ బదిలీల విషయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగానే వారం క్రితం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు వచ్చిన సందర్భంలో ఎస్పీతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరుపై ఎలా వ్యవహరించాలో చర్చించారు. చీరాల, కొండెపి, దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీలోనే రెండు, మూడు గ్రూపులు ఉండటంతో, ఎస్.ఐ.ల బదీలీలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన బాలినేని, దానికి అనుగుణంగా ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. జాబితా కూడా సిద్దమై పోయింది. రెండు, మూడు రోజుల్లో బదిలీలు జరుగుతాయని ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ, 10 రోజులు దాటిపోతున్నా బదిలీలు మాత్రం జరగడం లేదు సరికదా…, అవినీతి, ఆరోపణలపై 60 మందికి పైగా ఎస్.ఐ లు, కానిస్టేబుళ్లను ఎస్పీ సస్పెండ్ చేశారు. పదుల సంఖ్యలో సిబ్బందిని అంతగా ప్రాధాన్యం లేని శాఖలకు బదిలీ చేయడంతో ఎమ్మెల్యేలు.., ఇదేంటని ఉలిక్కిపడుతున్నారు.
అవినీతి పాల్పడితే బదిలీ వేటే….!
ప్రకాశం జిల్లాలో 10 రోజుల నుంచి 50 మందికి పైగా సీ.ఐ లు, ఎస్.ఐ లు, కానిస్టేబుళ్లను.., ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. తొలుత మంత్రి బాలినేని సొంత నియోజకవర్గం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్ పై వేటు పడింది. పోలీస్ స్టేషన్‌లోనే సివిల్ పంచాయతీలు, ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేస్తున్నారని, సీ.ఐ లక్ష్మణ్ పై ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారించిన అధికారులు, సీ.ఐపై బదిలీ వేటు వేశారు. అనంతరం ఆగస్టు 28న అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డారని, ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేస్తున్నారని, 38 మంది పోలీస్ సిబ్బందిని ఒకేరోజు ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
విచారణలో ఆరోపణలు నిజమని తేలితే.., కొందరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఎస్పీ చెప్పడం సంచలనంగా మారింది. దీంతో పాటు, పోలీస్ అధికారులే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఏ అధికారిని సస్పెండ్ చేస్తున్నారో? వారు పనిచేస్తున్న స్టేషన్, వారి పేరు, వారి కేడర్ ని పత్రికలకు రిలీజ్ చేశారు.
దీంతో ఒక్కసారిగా పోలీస్ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. సస్పెండ్ కావడంతో పాటు.., సస్పెండ్ అయిన వారు అవినీతి పరులు అని ప్రజలకు పేర్లతో సహా ఇవ్వడం గతంలో ఎన్నడూ లేదని ఎస్పీపై గుర్రుగా ఉన్నారు. సస్పెన్షన్ తర్వాత పోస్టింగ్ వచ్చినా.., తాము పనిచేసే తోటి సిబ్బంది తమకు విలువ ఇవ్వరని, ప్రజలు కూడా లెక్కచేయరని సస్పెండ్ అయిన వారు మదనపడుతున్నారు. దీంతోపాటు.., అసమర్థత, అవినీతి ఆరోపణలమీద ఎస్పీ పదుల సంఖ్యలో బదిలీలు చేశారు.
దీనికి నిరసనగా ఒంగోలు ట్రాఫిక్ స్టేషన్ రైటరు, ఒంగోలు కలెక్టరేట్ వద్ద మంగళవారం బహిరంగంగా నిరసన తెలియజేశారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రైటర్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు శాఖలో అలా బహిరంగ నిరసనకు దిగటం తప్పే. ఎస్పీ అతనిని సస్పెండ్ చేయటం కూడా కరెక్టే అనే అభిప్రాయం కొందరు సిబ్బందిలో వ్యక్తమవుతోంది. కానీ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న వరుస బదిలీలు, సస్పెనన్ల వ్యవహారంలో లోగుట్టు ఏమిటనే అంశం చర్చనీయాంశంగా మారింది. చిన్నచిన్న అంశాలకు సంబంధించి కూడా తీవ్రమైన చర్యలకు అధికారులు పాల్పడుతున్నారనే భావన కొందరు అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని వారు మంత్రి బాలినేని దృష్టికి తీసుకురావడంతో.., ఎస్.ఐ ల బదిలీలపై ఎస్పీతో మాట్లాడి వెంటనే జరిగేలా చూస్తానని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ సిపార్సులతో 20 మంది ఎస్.ఐ.ల బదిలీలు జరగనున్నందున ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది…!










