ఏపీలో కమ్మ, రెడ్డి, కాపు కులాలతోపాటు దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు, ముఖ్యంగా బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గంలో 95 శాతం వైసీపీలో, కమ్మ సామాజిక వర్గంలో 95 శాతం టీడీపీకి అనుకూలంగా ఉంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అయితే కాపులు కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో, మరికొంత కాలం టీడీపీకి మద్దతు పలికారు. సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో తమ కులానికి కూడా ఓ పార్టీ వచ్చిందని కాపులు సంబర పడ్డారు. కానీ ప్రజారాజ్యం వచ్చినంత వేగంగానే కాంగ్రెస్‌లో కలసిపోయింది. ఆ తరువాత జనసేన ఆవిర్బవించిన సంగతి తెలిసిందే. అన్న చిరంజీవి మోసం చేసినా, తమ్ముడిపై నమ్మకంతో కాపుల్లో చాలా మంది నేటికీ జనసేనను నమ్ముకున్నారు.
బీజేపీ కాపులను ఓన్ చేసుకుంటుందా?
రాష్ట్రంలో కాపులందరినీ ఓ తాటిపైకి తెచ్చేందుకు కేంద్ర బీజేపీ పెద్దలు రాజకీయ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాపు నేత కన్నా లక్ష్మీనారాయణకు 2018లో బీజేపీ పగ్గాలు అప్పగించారు. తాజాగా మరోసారి ఏపీ బీజేపీ పగ్గాలు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు అప్పగించారు. దీని ద్వారా బీజేపీ కాపు పార్టీ అనే సంకేతాలను పంపించినట్టయింది.
ఏపీలో కమ్మ వారిని నమ్ముకుంటే బీజేపీ ఎదగదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఏపీ బీజేపీలో కాపులకు పెద్దపీట వేస్తున్నారని సమాచారం. దీనికితోడు ఇప్పటికే బీజేపీ, జనసేనతో కలసి ముందుకు సాగుతోంది. ఇది కూడా బీజేపీకి అనుకూలించే అంశమే.
అందుకే కమ్మ నేతలను దూరంపెట్టారా?
మొదటి నుంచి ఏపీలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న కమ్మ సామాజిక వర్గ నేత వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. ఇక ఆయన పార్టీకోసం పనిచేసే అవకాశం లేదు. ఇక ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరీ వీరంతా కమ్మ సామాజికవర్గం నేతలే.
తాజాగా ఏపీ బీజేపీ ప్రకటించిన కార్యవర్గంలో వీరికి చోటు, వీరి మనుషులకు ప్రాధాన్యం దక్కలేదు. వీరికి కేంద్రంలో బీజేపీ ఏవైనా పదవులు ఇస్తుందా అంటే అలాంటి సంకేతాలు కూడా ఏమీ లేవు. కమ్మ వారిని వదిలించుకుని కాపులకు పెద్దపీట వేస్తే వచ్చే ఎన్నికల నాటికి కాపులను ఒకతాటిపైకి తీసుకురావచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అందుకే కమ్మలకు ఏపీ బీజేపీలో పెద్దపీట లేకుండా చేశారని వినికిడి.
కాపులతో బీసీలు కలసి వస్తారా?
ఏపీలో కాపులు అనేక కులాలుగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు, మధ్యఆంధ్రాలో కాపులు, నాయుళ్లు, ఇక చిత్తూరులో బలిజలుగా చలామణిలో ఉన్నారు. అయితే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు వారివెంట నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రెండు కులాలకు రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. ఇక బీసీలు కాపులను నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా కోస్తాలో కాపులకు దళితులకు పొసగదు. కాపులకు దళితులు ఎట్టి పరిస్ధితుల్లో మద్దతు ఇవ్వరు. అందుకే కాపుల ప్రత్యేక పార్టీగా బీజేపే అవతరిస్తే వారికి ఏ కులం నుంచి మద్దతు దక్కే అవకాశం లేదు.
కేవలం ఒక కులాన్ని నమ్ముకుని ఓ పార్టీని నిర్మిస్తే, వారి ఓట్లతోనే అధికారం దక్కించుకోవడం సాథ్యం కాదు. ఈ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు అయితే ఓటింగ్ శాతం పెంచుకునే అవకాశం మాత్రం దక్కుతుంది. అంతకు మించి ఏపీలో బీజేపీ, జనసేనలు పెద్దగా సాధించేది ఏమీ లేదనే చెప్పవచ్చు.