అమ్మఒడి పధకం పేరుకేనా ? ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ కేవలం ప్రకటనకే పరిమితమయ్యిందా ? అమ్మ ఒడి మాటున బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు జగన్ చేసిన అన్యాయం ఏమిటి ? ఈ పథకం పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏంటి ?
పిల్లలను బడికి పంపితే చాలు.. తల్లుల ఖాతాల్లోకి 15 వేలు జమ చేస్తాం. ఇతలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తాం.. ఇది ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ చేసిన ప్రకటన. ఊరూరా తిరిగి మహిళలకు జగన్ ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చాకా జగన్ ఇచ్చిన హామీ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక అమ్మ ఒడి పథకం పేరుతో అనేక పథకాలకు పంగనామాలు పెట్టేశారట జగన్.
నిజానికి ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంతమందికి 15వేల రూపాయల చొప్పున ‘అమ్మ ఒడి’ కింద ఇస్తామని చెప్పి జగన్ ఎన్నికల ముందు మహిళలను ఊరించారు. అయితే అధికారంలోకి వాచక ఆ మాట మార్చేశారు. అమ్మ ఒడి ఇంట్లో ఒక్కరికే వర్తిస్తుందని 15వేల రూపాయలకే దానిని పరిమితం చేశారు.దీంతో జగన్ చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి అనే చర్చ జరుగుతోంది.
ఇక ఎంతో గొప్పగా డబ్బా కొట్టుకుని ప్రవేశ పెట్టిన ‘అమ్మఒడి’ అమలు పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి రెండు సంవత్సరాలు పాటు జనవరిలో ఇచ్చిణ జగన్ సర్కార్.. మూడో ఏడాది నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూలై నెలలో ఇస్తామని ప్రకటించారు.ప్రస్తుతం ఆ ప్రకటించిన దాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది జగన్ ప్రభుత్వం.ఇక జగన్ హయాంలో ఐదేళ్లు అందాల్సిన అమ్మ ఒడి నాలుగేళ్లు మాత్రమే అందుతుందని తేలిపోయింది.
మరోవైపు అమ్మ ఒడి అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలను గట్టెక్కించేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి విదేశీ విద్య పథకం కింద ఒక్కో విద్యార్థికి 10 లక్షల రూపాయలను ప్రభుత్వం రాయితీగా అందించేది.జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పూర్తిగా తొలగించేశారు.దీంతో ప్రభుత్వ హామీని నమ్మి ఇప్పటికే విదేశాల్లో చదువుతున్న సుమారు 4 వేల మంది విద్యార్ధులు ప్రభుత్వం నుంచి సహాయం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై పథకం ఆపేస్తే ఆపేయచ్చు కానీ, ఇప్పటికే అమలులో ఉన్న పథకం ద్వారా విదేశాలకు వెళ్ళిన వారికి రాయితీ ఇవ్వాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు కోరినా జగన్ సర్కార్ మాత్రం తన మోడి వైఖరిని విడనాడడం లేదు.
ఇక గతంలో విద్యోన్నతి పథకం ద్వారా గ్రూప్స్, సివిల్స్ ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేల రూపాయల సాయం చేసేది. జగన్ అధికారంలోకి వచ్చాకా ఈ పథకాన్ని కూడా నిలిపివేశారు.అదేవిధంగా పదో తరగతిలో ప్రతిభ చూపిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు ఫీజులు కట్టడం, ప్రాథమిక విద్యలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ వంటి అనేక పథకాలను వైసీపీ సర్కారు నిలిపివేసింది.
మరోవైపు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ లాంటి ఉన్నత విద్య చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేసేది.కాగా, ఇప్పుడు జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆపివేస్తూ జీవో నెంబరు 77 విడుదల చేశారు. ఇదివరకు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏటా 9,600 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేదీ. వైసీపీ దానిని 7500 రూపాయలకు తగ్గించేసింది. డిగ్రీ విద్యార్థులకు గతంలో 12వేలు ఇస్తుండగా ఇప్పుడు అదికాస్తా 10వేలకు తగ్గింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏటా రూ.14,500 లోనూ కోట విధించారు.
నిజానికి డిగ్రీ, ఆపై చదువులు చదివే ప్రతి విద్యార్థికి వసతి దీవెన కింద ఏటా 20వేల రోపాయలు, ఐటీఐ చదివేవారికి ఏటా 10వేలు, పాలిటెక్నిక్ చదివేవారికి 15వేలు ఇస్తామని జగన్ ఎన్నికల సమయంలో చెప్పారు. అవన్నీ ఇస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాటి అమలులో అన్నీ కోతలే కనిపిస్తున్నాయి. ఒక త్రైమాసికానికి సంబంధించిన 683 కోట్లు ఎగరకొట్టేసింది. ఇలా అనేక కోతలతో రూపుదిద్దుకున్న పథకామే అమ్మఒడి.
ఇదిలా ఉంటే అమ్మ ఒడి పథకం పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా అమ్మ ఒడి – నాన్న బుడ్డీ గా మారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అందులోనూ నిజం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదం చేస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇక మద్యం ధరలు కూడా పెంచేశారు. మరోవైపు మద్యం పై వచ్చే ఆదాయంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం అని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. దీంతో అమ్మ ఒడి – నాన్నబుడ్డీ అనే విమర్శలు నిజమే అనే అభిప్రాయాలు వ్యాక్తమవుతున్నాయి.











